న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ అంశంపై జేపీసీ వేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని ఐదోరోజూ బీఆర్ఎస్, విపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభమయ్యాక ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించడంతో సభలో గందరగోళం నెలకొంది.
పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడడంతో విపక్ష నేతలతో కలిసి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ కంపెనీల అవకతవకలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నామ నాగేశ్వరరావు దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు దేశ రాజధానిలో న్యాయం కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ప్రధాని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణమని వ్యాఖ్యానించారు.