Saturday, November 23, 2024

అదానీ అంశంపై పట్టు వదలని బీఆర్‌ఎస్.. విపక్షాలతో కలిసి పార్లమెంట్ లోపల, బయట నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ అంశంపై బీఆర్‌ఎస్ నాలుగో రోజూ పట్టు వీడలేదు. అదానీ హిండెన్‌బర్గ్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించడంతో పాటు  జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరుతూ గురువారం ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత ఎంపీ నామా నాగేశ్వరరావు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్, విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభల వాయిదా అనంతరం పార్లమెంట్ బయటకు వెళ్లి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా  నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రజా ప్రాధాన్యం ఉన్న అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించి, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నా విపక్ష ఎంపీలు రోడ్ల మీద కు వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ అశంపై స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. కేంద్రం దిగి వచ్చేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలపైకి పంపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎంపీ నాగేశ్వరరావు ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement