కార్యకర్తల కోరిక మేరకు ఈ యాత్ర
త్వరలోనే తేదీలను ప్రకటిస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు
రేవంత్ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ గా ఉంది
కెసిఆర్ వచ్చే ఏడాది నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటన
రైతులను నిండా ముంచిన దళారి ప్రభుత్వం
ట్విట్టర్ వేదికగా రేవంత్ పై కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్ -పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు ఈ యాత్ర చేపడతానని చెప్పారు.. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, ఇతర ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం యాత్ర తేదీలను ప్రకటిస్తానని వెల్లడించారు.. ట్విట్టర్ ద్వారా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో దీపావళి రోజున రాత్రి సమయంలో లైవ్ ద్వారా మాట్లాడిన కెటిఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు..
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని అన్నారు.. న్యాయం చేయాలని కోరుతున్న పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు..అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని విమర్శంచారు.. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమైన స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
వచ్చే ఏడాది క్షేత్ర స్థాయిలో కెసిఆర్
తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ వచ్చే ఏడాది నుంచి క్షేత్రస్థాయిలోకి దిగుతారని కెటిఆర్ చెప్పారు.. కొత్త ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వాలనే అలోచనతో ప్రస్తుతం ఆయన మౌనంగా ఉన్నారని తెలిపారు.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు..
రైతులను నిండా ముంచిన దళారి ప్రభుత్వం ..
కాంగ్రెస్ దళారి ప్రభుత్వం.. రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి కోతలు జరుగుతున్నా ఇంతవరకు రైతుబంధు వేయలేదన్నారు. ₹15 వేల రైతు భరోసా ఊసే లేదని మండిపడ్డారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిందని తెలిపారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని, అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన తీరు రైతన్న అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
దళారులతో కుమ్మకైన కాంగ్రెస్
దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని కేటీఆర్ అన్నారు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందని ఆరోపించారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.