ఇక విలీనాల హోరు – కూటముల జోరు
ఢిల్లీ పీఠంపై మాదే కమాండ్
5 లక్షల మంది సమక్షంలో 18న భారాస సమర శంఖారావం
కేసీఆర్ కొత్త సంచలనానికి తెరతీయబోతున్నారు. భారత రాష్ట్ర సమితి జాతీయ ప్రకంపనాలకు ఖమ్మంలో శంఖారావం పూరించబోతున్నారు. ఖమ్మం గుమ్మం నుంచే భారాస భావి కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయిదు లక్షల మందికి పైగా ప్రజల సమక్షంలో తన తొలి అడుగు వేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. జాతీయ రాజకీయ యవనిక మీద భారాసతో భవిష్యత్ రాజకీయాలకు ఆద్యునిగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఖమ్మంలో వినిపించే సమర శంఖారావం ఢిల్లి కోటల్లో ప్రతిధ్వనించాలన్నది ఆయన అభిమతంగా ఖమ్మం సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కసారి ఖమ్మం సభ జరగడమే తరువాయి… ఇకపై ఢిల్లి కేంద్రంగా భారాస దూకుడు మొదలు కానున్నది…
హైదరాబాద్, ఆంధ్రప్రభ: 2024 ఎన్నికలకు ఖమ్మం నుంచే సమర శంఖం పూరించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు అనేక ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయని స్పష్టం చేశారు. తమ విధానాలు నచ్చి ఇప్పటికే 14 ఉప ప్రాంతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌లో విలీనానికి సిద్ధమయ్యాయని తెలిపారు. సహజ వనరులను వినియోగించుకుని సంపద సృష్టించడం, తద్వారా దారిద్య్రాన్ని దేశం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా పుట్టిన భారత రాష్ట్ర సమితి త్వరలోనే ఒక చరిత్ర సృష్టించనున్నదని ధీమా వ్యక్తం చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధినేత, తన పార్టీ ముఖ్య నేతలకు మార్గనిర్ధేశం చేశారు. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలో రకరకాల అనుమానాలు, అపోహలను పటాపంచలు చేస్తూ స్పష్టమైన వ్యూహాన్ని, లక్ష్యాన్ని వివరించారు. సోమవారం ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అనంతరం పార్టీకి చెందిన పలువురు ముఖ్యమైన నేతలతో బావి వ్యూహరచనపై సమీక్షించినట్లు తెలిసింది.
ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంగా తలపెట్టిన బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాలని సూచించారు. ఇక్కడ సమర శంఖం ఊదితే ఎర్రకోటకు వినిపించేలా భారీ ఏర్పాట్లు చేయాలని, ఢిల్లి కోట దద్ధరిల్లేలా, విపక్షాల గుండెలదిరేలా ఈ సభను విజయవంతం చేసేందుకు కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే దేశంలోని 14 ఉప ప్రాంతీయ పార్టీలు విలీనానికి సంసిద్ధత వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఆమ్‌ఆద్మీ, సమాజ్‌వాదీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే సాధారణ ఎన్నిల్లో దేశవ్యాప్తంగా 70 నుంచి 75 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్‌ఎస్ బలమైన పోటీ ఇస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు- పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్ల్రోని బీఆర్‌ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించినందున ఆరంభ సభ అదిరిపోవాలని, బీఆర్‌ఎస్ నినాదం దేశానికి దిక్సూచి కావాలని ఆయన ఆకాంక్షించారు.