న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్లు రోజుకో డ్రామా ఆడుతున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నాటకాలకు అంతమనేదే లేకుండా పోయిందని అన్నారు. లిక్కర్ డ్రామాతో బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని, కేసీఆర్ మోదీ-అమిత్ షాల ముద్దు బిడ్డ అని దయాకర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న పార్టీల నేతలపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతీది తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో జోడీ కట్టి బీఆర్ఎస్ అంతర్థానమయ్యే పరిస్ఠితికి వచ్చిందని జోస్యం చెప్పారు. కవితను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ను బీజేపీ బెదిరిస్తోందని చెప్పుకొచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేసు నుంచి తప్పించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండి కూటమనిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని దయాకర్ తెలిపారు.
లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులిచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. కవిత అరెస్ట్ పేరుతో గతంలోనూ హైడ్రామా చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి కేసీఆర్‌కు అనుకూలంగా ఉండడం వల్లే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చారని దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. హేమంత్ సోరెన్ కూడా దర్యాప్తు సంస్థలకు లేఖ రాశారని… సోనియా, రాహుల్‌ను కూడా దర్యాప్తు సంస్థలు వదల్లేదని ఆయన చెప్పుకొచ్చారు.
లేఖ రాయగానే విచారణ ప్రక్రియ ఆగడం కవితకు ఎలా సాధ్యం అవుతుందని అనుమానం వ్యక్తం చేశఆరు. కేసీఆర్‌పై ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ అడిగానే తప్ప పార్టీని మరేమీ అడగలేదని వెల్లడించారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని దయాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అమ్ముల పొదిలో అద్దంకి దయాకర్ ఆయుధమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తనకు మంచి అవకాశం ఇస్తుందని దయాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకున్నా అందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు.