Wednesday, October 30, 2024

BRS Offer – కామ్రెడ్ల‌కు చెరో సీటు… రెండు ఎమ్మెల్సీలు కూడా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి ఎన్నికల్లో వామపక్ష పార్టీ(సిీపీఐ, సీపీఎం)లతో కలిసి బరిలోకి దిగాలని భారత రాష్ట్ర సమితి(భారాస) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక నిర్ణయానికి వచ్చిననట్టు తెలుస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో అసెంబ్లి సీటును ప్రతిపాదించాలని అయన నిర్ణయించినట్టు సమాచారం. ఈ రెండు పార్టీలు చెరో నాలుగు సీట్లు కోరాలని అనుకుంటున్నా అది సాధ్యమయ్యే పనికాదని ప్రచారం జరుగుతోంది. సీపీఐకి బెల్లంపల్లి, సీపీఐ(ఎం)కు భద్రాచలం స్థానాలిచ్చే యోచనలో గులాబీ దళపతి కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఈ రెండు నియోజక వర్గాలతో పాటు ఈ పార్టీలకు చెరో ఒక్కో ఎమ్మెల్సీ పదవి, రెండు కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవులను సైతం కట్టబెట్టాలన్న ప్రతిపాదనకు కేసీఆర్‌ వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి రావాలని ఇరు పక్షాల కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంను కోరాలని ఆయన ప్రతిపాదించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ప్రచార సభలో ఇచ్చిన హామీ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనీ, ఈ అసెంబ్లి ఎన్నికల్లో ఆ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు భారాస వర్గాలు చెబుతున్నాయి.

ఉభయ వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నాలుగు రోజుల క్రితం ఇక్కడి ఎంబీ భవన్‌లో సమావేశమై తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లి ఎన్నికలు, భారాసతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం అసెంబ్లి ఎన్నికల్లో భారాసతోనే కలిసి వెళ్లాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీతో ఎట్టి పరిస్థితిలోనూ సీట్ల సర్దుబాటు చేసుకోరాదని ఆ పార్టీతో పొత్తుకు తాము త#హత#హ లాడుతున్నామని జరుగుతున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని ఈ భేటీలో ప్రతిపాదించినట్టు సమాచారం.. బీజేపీని నిలువరించడమే జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల ధ్యేయమని నేతలు ఉద్ఘాటిస్తున్నారు భారాసను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కూడా ఈ సమావేశంలో నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు బుడ్డి చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉందని పేర్కొన్నారు.

బెల్లంపల్లి సీపీఐకి కంచుకోట!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సీపీఐకి కంచుకోట అని ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడినట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో బెల్లంపల్లి నుంచి సీపీఐ ఎమ్మెల్యేగా దివంగత గుండా మల్లేష్‌ రెండు దఫాలు పోటీ చేసి గెలిచారని కేసీఆర్‌ గుర్తు చేసినట్టు సమాచారం.

- Advertisement -

భద్రాచలం సీపీఎంకు అడ్డా
కొత్తగూడెం జిల్లా భద్రాచలం (ఎస్టీ) అసెంబ్లిని సీపీఐ(ఎం)కు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన భారాస చీఫ్‌ కేసీఆర్‌ ఈ సెగ్మెంట్‌ ఆ పార్టీకి అడ్డా అని చెప్పినట్టు సమాచారం. గతంలో ఈ అసెంబ్లి స్థానం నుంచి సీపీఎం పలు సార్లు పోటీ చేసి గెలించిందని ఈ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

రెండుకు నో అంటే స్నేహపూర్వక పోటీ
భారాస చీఫ్‌ ప్రతిపాదిస్తోన్న రెండు అసెంబ్లి చెరో ఎమ్మెల్సీ, కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవులకు ఉభయ వామపక్షాలు ముందుకు రాని పక్షంలో రెండు పార్టీలు బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో స్నేహ పూర్వక పోటీకి కూడా సిద్ధమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం లేదా పాలేరు నియోజక వర్గం నుంచి పోటీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ రెండు నియోజకవర్గాలు సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన జాబితాలో లేకపోవడంతో వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు పార్టీల ముఖ్యనేతలతో సమావేశమై సీట్ల సర్దుబాటు ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ పదవుల అంశాన్ని చర్చించి ఒక అంగీకారానికి రావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement