Thursday, November 21, 2024

Delhi | బీజేపీలోకి క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు క్యూ కడుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు ఎంపీలు కమలం గూటికి చేరారు. గురువారం నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మరికొందరు నేతలతో కలిసి బీజేపీలో చేరగా, అదే రోజు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా చేరతారని తొలుత అందరూ భావించారు. అయితే ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో కమలం తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని బీబీ పాటిల్‌కు అందజేసి, కండువాతో స్వాగతించారు.

చేరిక కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్, చేరికల కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళిత, లింగాయత్ నేతలు బీజేపీలో చేరారని, ఇంకా చాలా మంది నేతలు క్యూలో ఉన్నారని తెలిపారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. మేడిగడ్డ బ్యారేజి ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరకుండా కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తోందని అన్నారు.

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందని, ఇప్పుడు ఎంపీ సీట్లు గెలిపిస్తేనే గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలతో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని, తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్త కూడా ప్రధాన మంత్రి కాగలడన్న నమ్మకం కల్గించిన బీజేపీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని తెలిపాిరు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరం లేదని అన్నారు.

మరోవైపు తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తండ్రి, కొడుకు, కూతురు మాత్రమే మిగిలారని, మిగతావారంతా ఆ కుటుంబానికి ముందు, వెనకా నడిచేవాళ్లేనని ఎద్దేవా చేశారు. బాప్, బేటా, బేటీ – బీబీబీ పార్టీగా పేరు మార్చుకోవాలని సూచించారు. పార్టీలో చేరిన బీబీ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పేదల కోసం పనిచేస్తోందని, దేశాన్ని ఆత్మనిర్భర్‌గా నిలిపిందని కొనియాడారు. పదేళ్లుగా దేశాభివృద్ధి ప్రధాని మోదీ ఎలా పనిచేస్తున్నారో చూశానని, అందుకే తాను కూడా బీజేపీలో చేరానని అన్నారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని బీబీ పాటిల్ అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాను అక్కడే మర్యాదపూర్వకంగా కలిశారు.

జహీరాబాద్ లేదా నాందేడ్!

బీబీ పాటిల్ బీజేపీలో చేరడం కోసం చాలా రోజుల క్రితం నుంచే సంప్రదింపులు జరుపుతున్నారు. జహీరాబాద్ టికెట్ తనకు ఇస్తానన్న హామీ లభిస్తే చేరతానంటూ మంతనాలు సాగించారు. అయితే టికెట్ గురించి తాము హామీ ఇవ్వలేమని, జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని రాష్ట్ర నాయకత్వం చెప్పడంతో ఇంతకాలం పాటు ఆయన చేరాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు పదేళ్లుగా ఆ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండడం, తెలుగు రాకపోవడం వంటి అంశాలతో పాటు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇది వ్యతిరేకతగా మారితే గెలవాల్సిన సీటు ఓడిపోవాల్సి వస్తుందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

- Advertisement -

ఈ క్రమంలో జహీరాబాద్ స్థానం కోసం రాష్ట్ర నాయకత్వం సినీ నిర్మాత దిల్ రాజును సంప్రదించినప్పటికీ.. ఆయన ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి బాగా రెడ్డి కుటుంబ నేపథ్యం ఉన్న జైపాల్ రెడ్డి, మీడియా సంస్థ అధిపతి యేలేటి సురేశ్ రెడ్డితోపాటు ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, బద్దం బాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన మహిపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ప్రధాన పోటీ జైపాల్ రెడ్డి, సురేశ్ రెడ్డి మధ్య ఉండగా.. ఇప్పుడు బీబీ పాటిల్ పార్టీలో చేరడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అయితే బీబీ పాటిల్‌ను మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి బరిలోకి దించుతారన్న కథనాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement