తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులాల గణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని… కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఎంతకాలం వేచి చూస్తారని ప్రశ్నించారు.
బీసీ గణన అశాస్త్రీయంగా జరిగిందని, ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ పేరుతో కాలయాపన చేసే ఆలోచన కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే చులకన ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నదని, మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసిందన్నారు. అయితే రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున… ఐదేళ్లలో బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని, అయితే గత బడ్జెట్‌లో మాత్రం అరకొర కేటాయింపులు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ వర్గాలకు నమ్మకం లేదని విమర్శించారు. ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
సాకులు చెప్పి కుంటివారు చెప్పిన దానికంటే తక్కువ రిజర్వేషన్ కల్పిస్తే తెలంగాణ సమాజం సహించదని, బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీని అమలు చేసేలా చేస్తామని హెచ్చరించారు.