బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గాలి అనిల్ కుమార్.. అలాగే పలువురు కార్పొరేటర్లు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి సీఎం రేవంత్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్‌తో పాటు పలువురు వారిని అభినందించారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వారి సంఖ్య పదికి చేరింది.