హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలో భారాస విస్తరణపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. పార్టీకి స్థానిక మహా ప్రజల నుంచి వస్తున్న స్పందనకు తోడుగా నిత్యం చేరికలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామ గ్రామన గులాబీ దళాన్ని సిద్ధం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉండేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేస్తుండటంతో స్థానిక నేతలు దూసుకెళ్తున్నారు.
తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లడం లేదని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో షట్కారీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు రుణ మాఫీ నిర్ణయానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడటంతో తనకు బదులుగా మహారాష్ట్ర భారాస ఇంఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావుకు ఆ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోనూ రుణాలు మాఫీ చేయాలి
మహారాష్ట్రలోనూ తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలన్న డిమాండ్ స్థానిక ప్రజల నుంచి వినిపిస్తోంది. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లే మహారాష్ట్రలోనూ చేయాలని అక్కడి నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతు రుణమాఫీ డిమాండ్‌ను భారాస లేవనెత్తబోతుంది. పార్టీ కార్యక్రమంలో ఆ డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇంఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, కర్నె ప్రభాకర్‌కు ఆ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
పార్టీ కార్యక్రమాలు, చేరికలను పర్యావేక్షించనున్నట్లుగా సమాచారం. కల్వకుంట్ల వంశీధర్ రావు డైరెక్షన్‌లో వీరంతా పని చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. భారాస అధికారంలోకి వస్తే తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు.