న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్ హింసపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనతో పార్లమెంట్ అట్టుడికింది. ఆరని మంటగా మారిన మణిపూర్ అంశంపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు శుక్రవారం వాయిదా తీర్మానాలు ఇచ్చారు. 80 రోజులుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసపై చర్చించి బీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎంపీలు కుర్చీల్లో నుంచి లేచి నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే మళ్లీ బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం మధ్య ప్యానల్ స్పీకర్ సభను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
మణిపూర్ అంశంపై కేంద్రం రెండురోజులుగా పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై ఎంపీ నామ నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే కేంద్రం చర్చ జరపకుండా వాయిదాల పర్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం రావణ కాష్టంలా మారినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం బిల్లుల ఆమోదం కోసమే సభలు జరపకుండా ప్రజాసమస్యల మీదా దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనలోని నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో సభకు తెలపాలని కోరారు. మణిపూర్ మారణకాండపై వివరణ ఇచ్చేవరకూ వదిలేదేలేదని హెచ్చరించారు. చర్చ జరిపేవరకూ వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉంటామని నామ స్పష్టం చేశారు.