Saturday, November 23, 2024

Big Story | ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీఆర్‌ఎస్‌ కసరత్తు.. రైతురాజ్యమే ప్రధానలక్ష్యం

ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ ఏర్పాటువాద ఉద్యమాన్ని ఐక్యం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో విభిన్న రూపాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారమార్గం చూపి అభివృద్ధి ఏజెండాగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్వనలో నిమగ్నమయ్యారు. ద్వీపకల్పంలో ఉన్న దేశంలో జీవధార నదులు ఉన్నప్పటికీ సాగునీటికోసం నోళ్లు తెరుచుకున్న బీడుభూములు, తాగునీటి కోసం గొంతుల తడిఆరిపోతున్న ప్రజల కష్టాల కన్నీళ్లు ఆయనను కలచి వేస్తోంది. పుష్కలమైన వనరులతో విరాజిల్లుతున్న భారతావనిలో విద్యుత్‌ లేని గ్రామాలు ఇప్పటికీ 18వేల 452 ఉండటం పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందుతూ దేశాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమం ఆశయంగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ప్రధానంగారైతురాజ్యంగా దేశాన్ని తీర్చి దిద్దేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

– వంగ భూమేశ్వర్, ఆంధ్రప్రభ

తెలంగాణ అభివృద్ధిని దేశానికి ఆదర్శంగా చూపుతూ రాబోయో ఎన్నికల మేనిఫెెస్టోను బీఆర్‌ఎస్‌ రూపొందిస్తూంది. దేశంలో సరిహద్దు దేశాల జలవివాదాలతో పాటుగా అంతరాష్ట్ర జలవివాదాలతో ఎక్కడికక్కడ సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయి సాగుకు యోగ్యమైన భూములు బీడు బారుతున్నాయి. దేశంలో ఇప్పటికీ 65 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం కావడంతో ఈ రంగాన్ని తీర్చి దిద్దేందుకు బీఆర్‌ఎస్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం స్వేచ్ఛావాయువులు పూల్చుకుని 75 ఏళ్లు పూర్తి అయినప్పటికీ దేశంలోని అనేక రంగాలతో పాటు వ్యవసాయరంగం కుదేలు అవడంపట్ల బీఆర్‌ఎస్‌ తీవ్రంగా స్పందిస్తోంది.

- Advertisement -

అభివృద్ధి ఎన్నికల ఏజెండాగా తెలంగాణ నమూన ఆదర్శంగా ఎన్ని కలమెనిఫెస్టోలో పొందుపర్చి క్షేత్ర స్థాయిలో ఎన్నికల ఘంటారావం మోగించేందుకు సిద్ధమై బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఏజెండాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదంగా ప్రజల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ గా అవతరించి వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమం ఏజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.

దేశంలో రాజకీయ అనిశ్చితిలో గోవా -కర్ణాటక మధ్య మహాదాయి జలవివాదం. పంజాబ్‌ -హర్యానా – రాజస్థాన్‌ -హిమాచల్‌ ప్రదేశ్‌ మధ్య జలవివాదాలు. కేరళా తమిళనాడు మధ్య ముల్లా పెరియార్‌ డ్యామ్‌ వివాదం, తమిళనాడు-కర్ణాటకమధ్య పాలార్‌ నది వివాదం, నర్మద, కావేరి జలవివాదాలు, గుజరాత్‌ సర్దార్‌ సరోవర్‌ వివాదంతో పాటుగా భారత్‌ బంగ్లాదేశ్‌ మధ్య ప్రవహిస్తున్న 54నదుల నీటి పంపకాలు, రావి-బియాస్‌ మిగులు జలాల సమస్య, బ్రహ్మపుత్ర నదీజలాల మధ్య చైనా-భారత్‌ లో రగులుతున్న సమస్యలు తో పాటు అనేక జలవిదాలతో దేశంలోని 15కోట్ల 83లక్షల 20వేల హెక్టార్ల సాగుభూమిలో కేవలం 35 శాతం భూమికి సాగునీరు అందగా మిగతాది రుతుపవనాలపై ఆధారపడటంతో వ్యవసాయ రంగం ఆశించిన అభివృద్ధి సాధించడంలేదనే అభిప్రాయంతో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే దేశవ్యాప్త సర్వే నిర్వహించి అంతరాష్ట్ర, సరిహద్దు దేశాల జలవివాదాలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో జలవివాదాల పరిష్కారాన్ని చేర్చబోతోంది.

దేశంలో నీటినిల్వ ప్రాజెక్టుల సామర్ధ్యం లేకపోవడంతో ప్రతి సంవత్సరం 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. జలవనుల వినియోగానికి ప్రత్యేక ప్రణాళికను మేనిఫెస్టోలో ప్రకటంచనున్నట్లు తెలిసింది. ప్రాచీన భారతదేశంలో సింధు నది నాగరికతలో విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేయగా అదే క్రమంలో మౌర్యులు, గుప్తుల నుంచి అనేక రాజ వంశాలు విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు సముద్ర రవాణా చేసినట్లు చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. అయితే స్వతంత్ర భారతదేశంలో ఎగిమతులు ఎలా ఉన్న దిగుమతులు రూ. 14లక్షల వేయి 448కోట్ల ఉన్నాయి.

వ్యవసాయరంగంలో తెలంగాణ మాదిరిగా దేశం స్వయం సంవృద్ధి సాధించే లక్ష్యం బీఆర్‌ఎస్‌ మెనిఫెస్టోలో అగుపించనుంది. పెరుగుతున్న జనాభకు సరిపడ ఆహారభద్రత కల్పించాల్సిన భాధ్యతలను పాలకవర్గాలు విస్మరించి దిగుమతులతో భద్రత కల్పించడాన్ని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. దేశంలో 40 నదులు జీవనాధారంగా ఉండటంతో పాటుగా గంగా,యమున, సరస్వతి, తపతి,తుంగభద్ర, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణ,కావేరి, గోదావరి నదులు జీవనదులుగా ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడం కోసం ప్రాజెక్టులు లేకపోవడం సమస్యగా మారింది.

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 18వేల 452 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా లేక గుడ్డిదీపాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. దేశానికి 8.30 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం కాగా ప్రస్తుతం ఏడున్నర మిలియన్‌ యూనిట్లు సరఫరాఅవుతుంది. ఈ నేపథ్యంలో దేశానికి 24గంటల విద్యుత్‌ సరఫరా అంశాన్ని బీఆర్‌ఎన్నికల ప్రణాలికలో చేర్చనుంది. అలాగే నిత్యం పెరుగుతున్ననిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని ఎన్నికలమేనిఫెస్టోలో పొందుపర్చి ఆబ్‌ కా బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో

బీఆర్‌ఎస్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా తెలంగాణ నమూనాను దేశంలో అమలుచేసి అభివృద్ధి లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే తరతరాలనుంచి అభివృద్ధి, సంక్షేమానికి దురమైన దేశంలోని కోట్లాది ప్రజల మస్తిష్కాలను బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ఏమేరకు చైతన్యం నింపుతుందో కాలం సమాధానం చెప్పనుంది.

రైతురాజ్యం బీఆర్‌ఎస్‌ లక్ష్యం: ప్రణాళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌

దేశంలో పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిందేకానీ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేదని ప్రణఆళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయరంగాభివృద్ధికి అత్యధికప్రాధాన్యత లభించనున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ నమూనాలో 24 గంటల విద్యుత్‌, నూతన పారిశ్రామిక విధానం, సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపే మార్గాలకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో వేదిక కానుందని ఆయన చెప్పారు.

దేశంలోని రాష్ట్రాల్లో విభిన్న సమస్యలు ఉన్నప్పటికీ కామన్‌ గా వ్యవసాయం, విద్యుత్‌, నిరుద్యోగం ఉందన్నారు. దేశానికి బీఆర్‌ఎస్‌ నాయకత్వం వహించే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణలో సాధించిన అభివృద్ధి దేశంలో సాధించి చూపిస్తామన్నారు. స్వతంత్రభారతదేశంలో ఇప్పటికీ తాగునీటి సమస్య,పోషకఆహారలోపం, విద్య,వైద్యం సమస్యలు ఉండటం విచారకరమన్నారు. దేశంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన అబ్కా బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని సాధించి తీరుతామనే ధీమాను ఆయన వ్యక్తంచేశారు. దేశంలో సంపదసృష్టించి ఆసంపదనను దేశాభివృద్ధి, సంక్షేమానికి వినియోగించడం బీఆర్‌ఎస్‌ లక్ష్యాల్లో ఒకటన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement