Monday, November 25, 2024

బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయం సిద్ధం.. 14న ప్రారంభోత్సవ ముహూర్తం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక హస్తిన నుంచి కార్యాకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఢిల్లీలోని ఎస్పీ మార్గ్‌లో అద్దెకు తీసుకున్న పార్టీ కార్యాలయ భవనంలో మరమ్మత్తు పనులు, మార్పులు చేర్పులు పూర్తిచేశారు. ఈ నెల 14న ఈ కార్యాలయాన్ని ప్రారంభించి హస్తిన నుంచి పార్టీ కార్యాకలాపాలు ప్రారంభించనుంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ కూడా నేతలిద్దరితోపాటు బీఆర్ఎస్ కొత్త కార్యాలయాన్ని పరిశీలించారు. ఇదివరకే సుధాకర్ తేజ సూచన మేరకు వాస్తుపరంగా కొన్ని మార్పులు, చేర్పులు చేయగా, ఈ నెల 14న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చేపట్టాల్సిన పూజలు, యాగశాల తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన మర్నాటి నుంచే ఆ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు జాతీయస్థాయికి విస్తరించే పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయన భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ, బీఆర్ఎస్ పత్రాలపై సంతకాలు చేయడం వంటి పనులను పూర్తిచేశారు. ఇక పార్టీని జాతీయస్థాయికి విస్తరించడం కోసం ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈలోగా తాత్కాలికంగా ఎస్పీ మార్గ్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాకలాపాలు ప్రారంభించేందుకు అక్కడ తగిన మార్పులు, చేర్పులు చేశారు. సొంత భవనం సిద్ధమయ్యే వరకు అద్దె భవనం నుంచి కార్యాకలాపాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎంపీ సంతోష్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ మరికొందరితో కలిసి ఆదివారం ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement