Wednesday, November 27, 2024

Delhi | ఒకే లైన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటి మధ్యలో మజ్లిస్ :కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా ఒకటేనని, మజ్లిస్ పార్టీకి జైకొట్టినట్టేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూడు పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చి వారికి లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు.

ఈ రెండు పార్టీలకు ఏకైక ఎజెండా బీజేపీని ఓడించడమేనని సూత్రీకరించారు. కేవలం మీడియా ముందు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, కానీ తెరవెనుక మాత్రం కలిసే పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు పార్టీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు, బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడతామని అన్నారని, తద్వారా తమ బంధాన్ని బయటపెట్టేశారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా ఉంటామని కేటీఆర్ చెప్పడం వెనుక ఉద్దేశం అదేనని, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణంలో చేరాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోందని తెలిపారు. ఆ మూడు పార్టీలూ ఒక్కటేనని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.

- Advertisement -

కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మజ్లిస్ తమకు మిత్రపక్షమని, తమది సెక్యులర్ పక్షమంటూ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మజ్లిస్ పార్టీ ‘సెక్యులర్ పార్టీ’ అని సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 15 నిమిషాలు సమయం ఇస్తే.. ఏం చేస్తామో చూడండి అన్న పచ్చి మతోన్మాదిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని వారితో దోస్తీ చేస్తున్న మీది ‘సెక్యులర్’ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అలాంటి పార్టీతో దోస్తీ ఎందుకు చేస్తున్నరో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. మజ్లిస్ ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య దోస్తీ కోసం మధ్యవర్తిత్వం మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందని అన్నారు. వీళ్లంతా ఒకరికొకరు సహకరించుకుంటున్న వైనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నాటి టీఆర్ఎస్ మంత్రి పదవులు అనుభవించిందని గుర్తుచేశారు. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆరే.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని అన్నారు.

కాంగ్రెస్ – బీఆర్ఎస్ – మజ్లిస్ పార్టీలు ఒక్కటే అని తాజా పార్లమెంట్ సమావేశాలు సైతం నిరూపిస్తున్నాయన్నారు. పార్లమెంటులో కలిసే మాట్లాడుతున్నారని, కలిసే అవిశ్వాస తీర్మానం పెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2014లో 22 మంది కాంగ్రెస్ నుంచి  గెలిస్తే 15 మంది టీఆర్ఎస్ గడీలోకి చేరారని, రెండోసారి.. 2018లో 19 స్థానాల్లోకాంగ్రెస్ గెలిస్తే 12 మంది గులాబీ కండువా కప్పుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు పిలిపించి భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ నిర్వహించలేదా అని ప్రశ్నించారు.

మణిపూర్‌లో భారతమాత హత్య జరిగిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారతమాతను చిత్రహింసలు పెట్టేందుకు మొఘలులు, పోర్చుగీసు, ఆంగ్లేయులు, మొన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నారని ధ్వజమెత్తారు. కానీ భారతదేశాన్ని, దేశ సంస్కృతి, నాగరికతను ఏమీ చేయలేకపోయారని కిషన్ రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదన్నారని, రాష్ట్రం అడిగినా, అడగకపోయినా కేంద్రం వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను ఇస్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రికి ఎన్ని లేఖలు రాసినా స్పందించకుండా మిన్నకున్నది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పార్లమెంటు వేదికగా అబద్ధాలు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement