Friday, November 22, 2024

Delhi | గుర్తును పోలిన గుర్తులతో తంటా, ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, తద్వారా తమకు చెందాల్సిన ఓట్లు గల్లంతవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గుర్తుల గందరగోళంపై రెండు వినతి పత్రాలు అందజేశారు.

‘యుగ తులసి’ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ గుర్తును పోలిన మరికొన్ని గుర్తులు ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నాయని, వాటిలో ‘టోపీ’, ‘ఇస్త్రీ పెట్టె’, ట్రక్, ఆటో రిక్షా, రోడ్డు రోలర్ వంటివి కారు గుర్తుకు సారూప్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో పలువురు ఓటర్లు రోడ్డు రోలర్ గుర్తును కారు గుర్తుగా పొరబడి ఓట్లు వేశారని, తద్వారా బీఆర్ఎస్‌కు దక్కాల్సిన ఓట్లు ఆ గుర్తుకు వెళ్లాయని కొన్ని ఉదాహరణలతో సహా వివరించారు.

ఈ పరిస్థితుల్లో యుగ తులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడం ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్స్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్, 1968 లోని పారా 10(బీ) స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘యుగ తులసి’ పార్టీ బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే రోడ్డు రోలర్ గుర్తును ఎంపిక చేసుకుందని వెల్లడించారు. మరో వినతి పత్రంలో కారు గుర్తును పోలిన గుర్తుల జాబితాను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సుదీర్ఘంగా వివరించిన బీఆర్ఎస్ నేతలు, అనంతరం గేట్ దగ్గర మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తు వల్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని ఎంపీ వెంకటేశ్ నేత తెలిపారు. ముఖ్యంగా వృద్ధ ఓటర్లు, చూపు సరిగాలేని ఓటర్లు ఈ గుర్తు విషయంలో గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తు ద్వారా తమకు జరిగిన నష్టాన్ని వివరించే ఉదాహరణలు, గణాంకాలు, ఇతర ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని తెలిపారు. 2011లో కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించిందని, కానీ ఆ తర్వాత కొన్ని పరిణామాలతో ఆ గుర్తును మళ్లీ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చారని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ గుర్తుల గందరగోళంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement