హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రాలో బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మార్చి 26న కాందార్ లోహాలో భారీ బహిరంగ సభ జరగనుండటంతో రాష్ట్ర పథకాలు, అభివృద్ధిపై స్థానికులకు తెలిపేలా ప్రచార రథాలను సిద్ధం చేసింది. మొత్తం 16 ప్రచార రథాలను కాందార్ లోహాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధివారం నాడు ప్రారంభించారు. 16 తాలుకాలలో ఉన్న 1600 గ్రామాల్లో తెలంగాణ పథకాల గురించి మహారాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యేలా వివరేంచేదుకు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం, రైతు బంధు, రైతు బీమాతో పాటు ప్రతి పథకాన్ని స్థానికులకు తెలపనున్నారు.
వీడియో స్క్రీన్ వాహనాల ద్వారా తెలంగాణ మోడల్ గురించి ప్రచారం నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ అంటే బీసీలు, రైతుల సంక్షేమమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తం కావాలని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో పంటలకు గ్యారెంటీ లభించిందన్నారు. రైతును రాజు చేసిన రైతు బంధు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి, నాగనాథ గీస్వడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.