హైదరాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ పార్టీగా నిలదొక్కుకునేందుకు భారాస ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర పై ప్రధానంగా దృష్టిని సారించింది. ఇప్పటికే మూడు సభలను నిర్వహించి హవాను చాటింది. నాందేడ్‌లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. సభ్యత్వ నమోదును పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ మోడల్‌ను ప్రచారం చేసింది. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి సాధించిన విధంగా మహారాష్ట్ర ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయిందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. నిత్యం చేరికలు కొనసాగేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు నాందేడ్ తర్వాత నాగ్‌పూర్‌పై దృష్టిని సారించారు.
నాగ్‌పూర్ బెల్ట్‌లో పాగాకు స్కెచ్..
మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా భారాస ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గతంలో సీఎం కేసీఆర్ సౌలభ్యం కొరకు నాలుగు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే నాందేడ్‌లో ఆఫీసును ప్రారంభించి శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇప్పుడు మరో కీలక బెల్ట్ అయిన నాగ్‌పూర్‌లో రేపు పార్టీ కార్యాలయాన్ని అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ కేంద్రంగా ఆ పరిసర ప్రాంతాలు, దాని పరిధిలోని నియోజకవర్గాలకు ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా చూడనున్నారు. రేపు సీఎం కేసీఆర్ నాగ్‌పూర్‌లో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
త్వరలో పూణే, ముంభైలోనూ..
మహారాష్ట్ర భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం. అన్ని పార్టీలు ముంభై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. పుణే, నాందేడ్, నాగ్‌పూర్ ప్రాంతాలు వాణిజ్య నగరం ముంభైకి చాలా దూరంగా ఉంటాయి. తక్కువ సమయంలో పార్టీ విస్తరించడం అంత సులువు కాదని గ్రహించిన అధినేత కేసీఆర్ ప్రధాన ప్రాంతాల వారీగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నాందేడ్‌లో ఆ ఫార్ములాను సక్సెస్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు నాగ్‌పూర్ బెల్ట్‌లోనూ పార్టీ విస్తరణ కోసం ఆఫీసును ప్రారంభించబోతున్నారు. దాని కేంద్రంగా కొన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో కార్యక్రమాలను రూపొందించుకొని స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయనున్నారు. ఆ తర్వాత పుణేలోనూ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముంభై నుంచి కొంత మంది నేతలు భారాసలో చేరారు. అక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గులాబీ గూటికి..
మహారాష్ట్ర నుంచి భారాసలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో అధినేత కేసీఆర్ సమక్షంలో నాగ్‌పూర్, ఔరంగాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు పార్టీ కండువా కప్పుకొన్నారు. ఔరంగాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ వినోద్ తంబె, యవత్మాల్ లోక్‌సభ స్థానికి పోటీ చేసిన ప్రవీణ్ పవార్‌లు పార్టీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, హిమాన్షు తివారీ పాల్గొన్నారు. అటు నాగ్‌పూర్‌లో ఎన్సీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రూపేష్ పన్నాసే, నాగ్‌పూర్ సౌత్ అసెంబ్లి నియోజకవర్గ ఇంఛార్జ్ సుఖదేవో వంజరిలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ తొమ్మిందేడ్ల పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి తీరును చూసి పార్టీలో చేరినట్లుగా వారు స్పష్టం చేశారు.