Tuesday, November 26, 2024

Delhi | ఢిల్లీలో ప్రారంభమైన బీఆర్ఎస్ భవన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా గురువారం వసంత్ విహార్‌లోని కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్త సమయానికి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ నేరుగా బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య కేసీఆర్ మధ్యాహ్నం 1.05 ని.లకు రిబ్బన్‌ కట్‌ చేసి భవంతిలోకి అడుగుపెట్టారు. అంతకు ముందే గణపతి హోమంతో మొదలుపెట్టి సుదర్శన యాగం, వాస్తుపూజ, పూర్ణాహుతి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. భవన ప్రారంభోత్సవ అనంతరం ముఖ్యమంత్రి పత్రాలపై సంతకాలు చేసి మొదటి అంతస్తులోని పార్టీ అధ్యక్ష కార్యాలయ బాధ్యతలు స్వీకరించారు. భవన్‌కు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  

- Advertisement -

బీఆర్‌ఎస్ బిల్డింగ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసంత్ విహార్ మెట్రో స్టేషన్ నుంచి బీఆర్‌ఎస్ భవన్ వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల రాకపోకలు నిలువరించారు. ఢిల్లీతో పాటు రాష్ట్రంలోని వివధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలిరావడంతో భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. దేశ రాజధాని కేంద్రంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు కూడా వేగవంతం అవుతాయని నాయకులు తెలిపారు.

బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం అనంతరం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం 23, తుగ్లక్ రోడ్ చేరుకున్న కేసీఆర్ సాయంత్రం గం. 4.30 సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు కూడా జతకలిశారు. రాత్రికి హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం ప్రగతి భవన్ చేరుకున్నారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం – కేటీఆర్

‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామంటూ బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. జలదృశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిన సందర్భంగా గులాబీ శ్రేణులందరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో.. పార్టీ కార్యకర్తల పట్టుదలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకమైన బీఆర్ఎస్ జెండా సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే..  ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతోందని, ఈ దశలో బీఆర్ఎస్ జాతీయ ప్రస్థానం.. ఒక చారిత్రక అవసరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమపాఠాల నుంచి.. యావద్దేశానికి పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసిఆర్ కు దక్కిందని ఆయనన్నారు.

ఈ మహాప్రస్థానంలో.. బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని.. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటిఆర్ గుర్తుచేశారు. జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొక్కాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన  కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశం కోసం కదంతొక్కాలని… ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని ఈ సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

దూరంగా మీడియా కెమేరాలు

ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులు బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు. అయితే ప్రాంగణం దాటి భవనం లోపలకు అనుమతించని పార్టీ నాయకత్వం, ఆ తర్వాత కాసేపటికే మీడియాను ప్రాంగణం నుంచి గేటు బయటకు పంపించారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి తామే స్వయంగా కవరేజి ఏర్పాటు చేశామని, ఆ లింక్  వినియోగించుకోవాలని సూచిస్తూ గేటు బయట ఉన్న మీడియా కెమేరాలు, ప్రతినిధులను మరింత దూరంగా పంపించారు. ఢిల్లీ తెలుగు మీడియాతో పాటు హిందీ, ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులెవరినీ కూడా లోపలకు అనుమతించలేదు. పిలవని పేరంటానికి వచ్చినట్లయిందని మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement