కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతోంది. ఆత్మీయులను దూరం చేస్తూ తీరని శోకాన్ని మిగుల్చుతోంది. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు. తాజాగా పుణెలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు.
పుణెలోని అకుర్ది ప్రాంతానికి చెందిన ఆదిత్య జాదవ్, అపూర్వ జాదవ్ అన్నదమ్ములు. ఇద్దరికీ కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆదిత్యకు సంవత్సరం క్రితమే పెళ్లయింది. అపుర్వ జాదవ్ అవివాహితుడు. వీళ్లిద్దరి మరణవార్తను తండ్రికి చెప్పలేదు కుటుంబసభ్యులు. ఆయన కూడా కరోనా సోకి చికిత్స పొందుతున్నారు.
వారం రోజుల క్రితం మీరట్లో ఇద్దరు కవలలు కరోనాకు బలయ్యారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసిన అన్నదమ్ములు… హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 24న కరోనాబారిన పడ్డారు. మే15న కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు.
ఇక విజయవాడలోనూ ఆరు రోజుల క్రితం ఇద్దరు అన్నదమ్ములు చికిత్స పొందుతూ మరణించారు. అప్పల నాయుడు, మనోహర్ నాయుడు ఓ ప్రైవేట్ సేల్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. పరిస్థితి విషమించి ముందు అప్పల నాయుడు.. తర్వాత మనోహర్ చనిపోయారు.