రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేయనున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా రికార్డ్కెక్కబోతోంది. ఇప్పటివరకు రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నారు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ వేడుక జరుగనుంది. ఇవాళ సాయంత్రం సరిగ్గా నాలుగున్నర గంటలకు పట్టాభిషేకం జరుగనుంది. నిజానికి.. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే.. గతేడాది ఆమె కన్నుమూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. ఈ క్రమంలో.. చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబోతోంది యూకే ప్రభుత్వం. పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.