Friday, November 22, 2024

అంగ రంగ వైభవంగా బ్రిటిష్ రాజుగా మూడో ఛార్లెస్‌ పట్టాభిషేకం

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌.. సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో కింగ్‌ ఛార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్ఠించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు.vప్రదక్షిణ.. ప్రమాణాలుపట్టాభిషేకం నిమిత్తం కింగ్‌ ఛార్లెస్‌ దంపతులు సంప్రదాయంగా వస్తున్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునీకరించిన డైమండ్‌ జూబ్లీ స్టేట్‌ కోచ్‌ బగ్గీలో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకున్నారు.

గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ ఆలాపన మధ్య సంప్రదాయ దుస్తులు ధరించి 14వ శతాబ్దపు సింహసనంపై ఆసీనుడైన చార్లెస్‌ తలపై భారతీయ కాలమాన ప్రకారం సరిగ్గా సాయంత్రం నాలుగున్నర గంటలకు క్యాంటర్‌బరీ ఆర్చ్‌బిషన్‌ జస్టిన్‌ వెల్‌బీ సెయింట్‌ ఎడ్వర్డ్స్‌ కిరీటాన్ని ఉంచారు. 1661లో ఈ ప్రత్యేకమైన కిరీటాన్ని తయారు చేయించారు. గడిచిన 360 సంవత్సరాల్లో కేవలం ఆరుగురు రాజులు మాత్రమే ధరించారు. ఈ కిరీటాన్ని ధరించిన మొట్టమొదటి అతి పెద్ద వయస్సు వ్యక్తి చార్లెస్‌. రాజుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజదండం, క్రాస్‌తో కూడిన బింబాన్ని చార్లెస్‌ అందుకున్నారు.

.అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేశారు. .

మరో వైపు చార్లెస్‌ పట్టాభిషేకం సందర్భంగా లండన్‌ సహ బ్రిటన్‌లోని 13 ప్రాంతాల్లో గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. దాదాపు 2300 మంది ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారతదేశం తరపున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌, ఆమె మనవరాలు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూల్‌ మెక్రాన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులు, రాజకుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేకమైన టోపీలు ధరించారు. చాలా మంది ఎరుపు రంగు దుస్తులు ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement