బ్రిటన్ రాజకుటుంబాన్ని క్యాన్సర్ వెంటాడుతుంది. తొలుత రాజు ఛార్ల్స్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా తనకు కూడా క్యాన్సర్ సోకినట్లు యువరాణి కేథరీన్ వెల్లడించారు. చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపారు.
”నేను బాగున్నాను, రోజురోజుకూ ఇంకా దృఢంగా మారుతున్నా” అని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ చెప్పారు.కేథరీన్కు సోకిన క్యాన్సర్ రకం, ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఆమె పూర్తిగా కోలుకుంటారని కెన్సింగ్టన్ ప్యాలెస్ విశ్వసిస్తోంది. జనవరిలో పొత్తికడుపులో శస్త్రచికిత్స చేసినప్పుడు, క్యాన్సర్ ఉన్నట్లు తెలియదని కేథరీన్ తెలిపారు.”ఆపరేషన్ తర్వాత పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కీమోథెరపీ చేయించుకోవాలని నా వైద్య బృందం సలహా ఇచ్చింది. నేను ఇప్పుడు ఆ చికిత్స ప్రారంభ దశలో ఉన్నాను” అని ఆమె చెప్పారు.
కేథరీన్కు ఫిబ్రవరి చివరిలో కీమోథెరపీ చికిత్స ప్రారంభమైంది.కేథరీన్కు వచ్చిన క్యాన్సర్ ఏంటనే విషయాన్ని బయటికి చెప్పలేమని ప్యాలెస్ తెలిపింది.ఆమె వయసు 42 ఏళ్లు.క్యాన్సర్ బారిన పడిన వారందరి గురించి తాను ఆలోచిస్తున్నానని ఆమె చెప్పారు.”ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని, ఆశను కోల్పోకండి. ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు” అని ఆమె తెలిపారు.