Saturday, October 5, 2024

Britain – పార్ల‌మెంట్ కు ఎన్నిక‌లు …. కొన‌సాగుతున్న పోలింగ్

650 స్థానాల‌కు పోలింగ్
ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న‌ 4.6 కోట్ల మంది
తొలి గంటలోనే ఓటు వేసిన బ్రిట‌న్ పిఎం స‌న‌క్ దంప‌తులు
రేపు తెల్ల‌వారుఝామున తొలి ఫ‌లితం
స‌ర్వేల‌లో రిషి స‌న‌క్ ఎదురుగాలి

లండన్‌: బ్రిటన్‌లో సార్వత్రిక సమరం మొదలైంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు ఆ దేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలి గంటలోనే ప్రధాని రిషి సునాక్ , ఆయన సతీమణి అక్షతా మూర్తి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, కెయిర్‌ స్టార్మర్‌ ఆధ్వర్యంలోని లేబర్‌ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

- Advertisement -

ఇంగ్లాండ్‌తో పాటు స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లోని మొత్తం 650 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 326 సీట్ల మెజార్టీ రావాలి. ప్రధాన పార్టీలతో పాటు లిబరల్‌ డెమొక్రాట్స్‌, గ్రీన్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రాటిక్‌ యూనియనిస్ట్‌ తదితర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. యూకే వ్యాప్తంగా దాదాపు 40వేల పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్‌లో 4.6కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చాలామంది పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటేశారు.

ఇక స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఓటింగ్‌ ముగుస్తుంది. ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసిన కాసేపటికే కౌంటింగ్‌ చేపట్టనున్నారు. యూకే కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి కంటే ముందే భారత్‌లో శుక్రవారం తెల్లవారుజామున తొలి ఫలితం వెలువడనుంది.

సునాక్ కు ఎదురు గాలి…

ఈ ఎన్నికల్లో సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. 14 ఏళ్ల తరవాత తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ ఓడిపోతుందని సర్వేలు సూచిస్తున్నాయి. 1997 మాదిరిగా లేబర్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ఘన విజయం దక్కే అవకాశాలున్నట్లు అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement