Friday, November 22, 2024

Britain Elections – ప్రధాని రిషి సునాక్‌ పార్టీకి ఘోర ఓటమి – 14 ఏళ్ల తర్వాత అధికారంలో లేబర్ పార్టీ

బ్రిటన్‌ ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్‌ పార్టీకి ఈసారి భంగపాటు తప్పలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను అనుగుణంగానే గురువారం ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయంతో విజయం సాధించింది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్‌ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కింది. ఈ పార్టీ మెజార్టీ మార్క్‌ను దాటి 360కి పైగా స్థానాలను సొంతం చేసుకోగా.. ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ 80 సీట్లు దాటింది.బ్రిటన్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ సారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

క్రితం సారి 67 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ పూర్తయిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. కాసేపటికే కౌంటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి లేబర్‌ పార్టీ 368 సీట్లు కైవసం చేసుకోగా.. కన్జర్వేటివ్‌ పార్టీ 87 స్థానాల్లో గెలుపొందింది.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాలి. రెండు ప్రధాన పార్టీలతో పాటు లిబరల్‌ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమోక్రాటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ, షిన్‌ ఫీన్‌, ప్లయిడ్‌ కమ్రి, వర్కర్స్‌ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌ పార్టీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికలుగా వీటిని రాజకీయ పండితులు విశ్లేషించారు. లేబర్‌ పార్టీ తరఫున కీర్‌ స్టార్మర్‌ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమిపాలవడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ పార్టీకి బలమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా అంతర్గత అస్థిరతను ఎదుర్కొంది. తరచూ ప్రధానులు మారడం.. ప్రభుత్వ నిర్ణయాలపై సొంత నేతల నుంచి విమర్శలు వ్యక్తమవడం కన్జర్వేటివ్‌ పార్టీని చిక్కుల్లో పడేశాయి.

ఇదే సమయంలో ప్రధాని రిషి సునాక్‌పైనా వ్యతిరేకత ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో దీన్నే లేబర్‌ పార్టీ తమ అస్త్రంగా మలుచుకుంది. అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని బలంగా ప్రచారం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement