Friday, November 22, 2024

Delhi: కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ నుంచి రప్పించడమే మా నైతిక విజయం: తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నేడు(21) నిర్వహిస్తున్న మునుగోడు సమరభేరి బహిరంగ సభ కేసీఆర్ పాలనకు పాతరేయడానికి ఆఖరి ఘట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. యువ నేత, ఉద్యమకారుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటున్న మునుగోడు సభ సీఎం కేసీఆర్ అవినీతి-నిరంకుశ పాలనకు సమాధి కట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం తరుణ్ చుగ్ అమిత్ షా తెలంగాణ పర్యటనపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ దుష్ట పాలనతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని బీజేపీ భావిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని అన్ని వర్గాలకు పెనుముప్పుగా మారిన కుటుంబాన్ని, వారి దుష్ట పరిపాలనను బయటపెట్టాలని బీజేపీ సంకల్పంతో ఉందని వెల్లడించారు. అమిత్ షా తన పర్యటన, ప్రసంగంతో ప్రజల్లో భరోసా నింపనున్నారని తెలిపారు. మునుగోడు బహిరంగ సభ రాష్ట్ర ప్రజల సామూహిక ఆగ్రహానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ దూకుడుతో కేసీఆర్, టీఆర్‌ఎస్ బెంబేలెత్తుతున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. బీజేపీకి భయపడి కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చేలా చేయడమే తమ నైతిక విజయమని హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టానికి తెర లేపబోతోందని నొక్కి చెప్పారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు సమావేశంలో పాల్గొంటారని తరుణ్ చుగ్ వివరించారు. కుటుంబ పాలనను ఇకపై సహించేది లేదన్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన యువత, విద్యార్థులు, ప్రజలు పెద్దసంఖ్యలో బహిరంగ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement