పెండ్లి వేడుకల్లో సాధారణంగా వధువు చేత వరుడి కాళ్లు మొక్కిస్తారు. తాళి కట్టినప్పుడు, అక్షింతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు, పూలదండలు మార్చుకున్నప్పుడు ఇలా చాలా సార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెండ్లి వేడుకలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా జరిగింది. వరుడే వధువు కాళ్లపైపడి దండం పెట్టాడు. వివాహ తంతు పూర్తయ్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూతరు దండలు మార్చుకుంటున్న సమయంలో పెండ్లి కొడుకు అకస్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్లపై పడ్డాడు. ఈ అనూహ్య పరిణామానికి పెండ్లికి హాజరైన బంధు మిత్రులంతా ఆశ్యర్చపోయారు. ప్రస్తుతం వరుడు వధువు కాళ్లపైపడ్డ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తున్నది.
కాగా, తాను వధువు కాళ్లపై పడటానికి చాలా కారణాలున్నాయని వరుడు చెప్పాడు. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి నాకోసం, నా సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు.