అహ్మదాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు. ఇదేకోవలోకి వస్తాడు ఈ గుజరాతీ పెండ్లికొడుకు. సాధారణంగా వరుడు కల్యాణ వేదికకు ఏ గుర్రం మీదనో, కారులోనో వస్తుంటాడు. అయితే అందరిలా తానెందుకు ఉండాలనుకున్నాడో ఏమో.. ఏకంగా జేసీబీలో లగ్గానికి బయలుదేరాడు.
గుజరాత్‌లోని నవ్సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ కు వివాహం జరుగుతున్నది. పెండ్లి కొడుకులా ముస్తాబైన కేయూర్ . ఊరేగింపుగా వివాహ వేదికకు బయలుదేరాడు. లగ్జరీ కారులోనో, బస్సు, గుర్రంపైన అయితే ఇక్కడ ప్రత్యేకత ఏముంది.. అతడు ఊరేగింపుగా వెళ్తున్నది జేసీబీలో. దీనికోసం జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌ను అందంగా అలంకరించారు. పందిరి కూడా వేశారు. అందులో ఓ సోఫాను సెట్ చేశారు. తన బంధువులతోపాటు సోఫాపై దర్జాగా కూర్చున్న కేయూర్ ఫంక్షన్‌హాల్‌కు బయల్దేరాడు. జేసీబీ ఎనుక అతని బంధుగనమంతా ఇతర వాహనాల్లో తరలి వస్తున్నారు. వివాహం ముగిసిన తర్వాత అదే జేసీబీలో వధూవరులను ఊరేగించారు. అయితే జేసీబీలో వెళ్తున్న పెండ్లి కొడుకును చూడటానికి ఊర్లోని జనాలు ఎగబడ్డారు. అతనితో సెల్ఫీలు తీసుకున్నారు. మరికొందరు ఈ వింత ఊరేగింపును తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడూ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతున్నది.