ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లా ధావర్‌లో విచిత్రం చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి జరగబోతుండటంతో వరుడు మండపంలో కూర్చున్నాడు. వధువు వచ్చి వరుడు పక్కన కూర్చుంది. పంతులు మంత్రాలు అందుకున్నాడు. అయితే పంతులు పఠించే మంత్రాలను పట్టించుకోకుండా.. వధువుతో మాటలు కలపాలనుకున్నాడు వరుడు. ఈ మంత్రాలు, లెక్కలూ మనకు అస్సలు అర్థం కావు అంటూ వధువుతో అన్నాడు. దానికి వధువు బదులిస్తూ మంత్రాలు అర్థం కాకపోతే పర్లేదు కానీ.. చిన్న చిన్న లెక్కలు అయితే వచ్చు కదా అని అడిగింది. కానీ అతనేం మాట్లాడలేదు. దీంతో వధువుకు ఎక్కడో తేడా కొట్టింది. వరుడి బండారం తెలుసుకునేందుకు రెండో ఎక్కం చెప్పు అని అడిగింది.
మీరు రెండో ఎక్కం చెబితేనే ఈ వివాహం జరుగుతుందని వధువు కరాఖండిగా చెప్పింది. దీంతో వరుడు కటింగ్ ఇస్తూ ‘రెండో ఎక్కమేగా… రెండు ఒకట్ల రెండు… రెండు రెళ్లు ఆరు.. ఎనిమిది.. అంటూ వరుడు నీళ్లు నమిలాడు. అంతే అక్కడి నుంచి లేచి వధువు గబగబా వెళ్లిపోపయింది. అక్కడేం జరుగుతుందో తెలియక అందరూ షాకయ్యారు. ఆమె అలా మండపంలో నుంచి దిగిరాగానే అందరూ ఆమె చుట్టూ చేరి ఏమైందని అడిగారు. ‘మీరే చెప్పండి… రెండో ఎక్కం కూడా చెప్పలేని వాన్ని పెళ్లి చేసుకోమంటారా? సూటిగా ప్రశ్నించింది. దీంతో అందరూ తెల్లమొఖం వేశారు. అయినా సరే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోవద్దని వధువుకు నచ్చజెప్పడానికి పెద్దలు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇక చేసేది లేక వధువు ఇష్టప్రకారమే పెళ్లి రద్దు చేసుకున్నారు
నిజానికి ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం. వధువు విద్యావంతురాలు. వరుడు నిరక్షరాస్యుడు. అసలు స్కూల్‌కే పోలేదంట. కానీ ఈ విషయాన్ని అబ్బాయి తల్లిదండ్రులు దాచి పెళ్లి చేయాలని ప్రయత్నించారు. నిజాలు చెప్పకుండా అసలు విషయం దాచి మోసం చేయాలని ప్రయత్నించారనే కారణంతోనే వధువు వివాహాన్ని ఆపేసిందని ఆమె బంధువులు తెలిపారు.