Friday, December 20, 2024

Breaking News – హైకోర్టులో కెటిఆర్ కు ఊర‌ట‌…

హైదరాబాద్ – ఈ కార్ రేస్ స్కామ్ లో కెటిఆర్ కు హైకోర్టులో స్వ‌ల్పం ఊర‌ట ల‌భించింది.. ఎసిబి త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.. ఇరు ప‌క్షాలు వాద‌న‌లు విన్న హైకోర్టు కెటిఆర్ ను వారం రోజుల పాటు అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించింది.. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 27కి వాయిదా వేసింది. కాగా, ఈ కేసును ఎసిబి విచార‌ణ చేసేందుకు అనుమ‌తి కూడా ఇచ్చింది.. ఈ కేసులో కౌంటర్ దాఖ‌లు చేయాల‌ని ఎసిబిని కోర్టు ఆదేశించింది..

కాగా, హైకోర్టులో కేటీఆర్‌ కేసు విచారణ వాడీవేడిగా జరిగింది. కేటీఆర్ తరపు లాయర్, ప్రభుత్వ తరపు లాయర్ మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ప్ర‌భుత్వం త‌రుపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది.. ప్రతి విషయం ఎఫ్ఐఆర్ లో ఉండదని అన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయని తెలిపారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంద‌న్నారు… రెండు నెలల క్రితం ఎం ఎ యు డి చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశార‌ని వివ‌రించారు.. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని ప్రభుత్వ తరపు లాయర్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని జడ్జ్ అడిగారు. .దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్యులైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని ఏజీ అన్నారు. విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింద‌ని తెలిపారు.. ఈ ఏడాది నిర్వహించాలనుకున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసమే చెల్లింపులు జరిగాయని ఏజీ తెలిపారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని ఏజీ పేర్కొన్నారు.

- Advertisement -

ఎఫ్ ఈ వో కు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయ‌న్నారు.. హెచ్ఎండీఏ ఇందులో భాగస్వామి కాకున్నా 55 కోట్లు చెల్లించిందన్నారు. ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ది చేకూరిందని ఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎవరెవరికి ఎలాంటి లబ్ది చేకూరిందనేది దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు.

కాగా ఈ కేసులో కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని తెలిపారు. ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్‌ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్‌ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్‌ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్‌ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ప్రొసీజర్ పాటించలేదని అనడం సరైనది కాదని అన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని అన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్‌ దీనికి వర్తించదని తెలిపారు.

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌లో స్పాన్సర్‌ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్‌ నిర్వహించకపోతే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దిబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 2024లో కచ్చితంగా ఈ కార్‌ రేసింగ్‌ నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌తో హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎఫ్ ఈ వో కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని అన్నారు. 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారమే ఎఫ్ ఈ వో కు చెల్లించారని చెప్పారు. అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. 13(1)ల, 409 అనే సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు లేదని తెలిపారు. 18న ఫిర్యాదు చేస్తే 19వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని చెప్పారు. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అన్నారు.

ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే కేసు రిజిస్టర్‌ చేయడం చట్ట విరుద్ధమని సుందరం అన్నారు. అఫెన్స్‌ జరిగిందని తెలిశాక మూడు నెలల లోపు కేసు రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుందని కానీ.. 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. లలితా కుమారి వర్సెస్‌ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్‌ను కేటీఆర్‌ న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫార్ములా ఈ రేస్‌ అగ్రిమెంట్‌ జరిగిన 14 నెలల తర్వాతే కేసు పెట్టారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్‌ పరిశీలించాలి.. కానీ ఈ కేసుతో ఏసీబీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్‌ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. కేటీఆర్‌ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు.

పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్లనే నిందితులుగా చేర్చాలని న్యాయవాది సుందరం అన్నారు. కానీ ఇక్కడ FEO సంస్థకు డబ్బులు చేరాయని.. ఆ సంస్థను మాత్రం అసలు నిందితుల జాబితాలోనే చేర్చలేదని చెప్పారు. ఇది కరప్షన్‌ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పీసీ యాక్ట్‌ 13(1) ఎలా వర్తిస్తుందని అడిగారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా పనిచేశారని చెప్పారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ క్లాజ్‌ ఉన్నప్పుడు క్రిమినల్‌ కేసు పెట్టాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పారు. అయినప్పటికీ కేటీఆర్‌ను ఏ1గా చేర్చారని తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు కాబట్టి.. స్టే ఇవ్వాలని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్​‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్​ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement