హుస్నాబాద్, మార్చి 4 (ఆంధ్ర ప్రభ) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు రెండోవ గండి పనులు పోలీస్ పహార మధ్య శనివారం అర్ధరాత్రి నుంచి అధికారులు ప్రారంభించినట్లు నిర్వాసితులు తెలిపారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతనే కట్ట పనులు ప్రారంభించాలని అధికారులను, ప్రజాప్రతినిధులకు పలుమార్లు చెప్పిన పట్టించుకున్న పాపాన పోలేదని భూనిర్వాసితులు వాపోతున్నారు. పలువురి భూనిర్వాసితులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, సుమారు 100 మందికి పైగా పెళ్లయిన వివాహితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, గత కొద్ది కాలంగా వివాహితులు నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగానే శనివారం ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి నిర్వాసితులు పనులను అడ్డగించే ప్రయత్నం చేయగా, పోలీసులు గుడాటిపల్లె గ్రామంలో నిర్వాసితులను గృహ నిర్బంధం చేసినట్లు భూనిర్వాసితులు తెలిపారు.
వేసవి కాలం కావడంతో వ్యవసాయ భూముల వద్దనున్న నోరులేని మూగజీవులు గేదెలు, ఆవులు, పశువులకు తాగునీరు పెడదామని వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్ట పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని పోలీసులతో మహిళలు, నిర్వాసితులు, యువతులు గుడాటిపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో మధ్యాహ్నం పోలీసులు భూ నిర్వాసితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గౌరవెల్లి గ్రామానికి వచ్చే పలు రహదారులను పోలీసులు దిగ్బంధం చేసి, వాహనదారుల వివరాలు అడిగి తర్వాత గ్రామాల్లోకి పంపిస్తున్నారు. దీంతో ఎమర్జెన్సీ పనులపై వెళ్లాల్సిన మహిళలు, వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నట్లు, పలువురు పోలీసుల తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించడంతో ఈ బందోబస్తును సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా పరిహారం ఇచ్చేంతవరకు గౌరవెల్లి ప్రాజెక్టు రెండో గండి పనులు ప్రారంభించడానికి భూ నిర్వాసితులు స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. పరిహారం ఇచ్చేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.