Tuesday, November 26, 2024

టీఎస్‌ ఆర్టీసీలో ప్రమోషన్లకు బ్రేక్‌.. అసంతృప్తిలో ఉద్యోగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీలో ప్రమోషన్లకు బ్రేక్‌ పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోగా, అనుకున్న స్థాయిలో డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌లు, ఇతర విభాగాలలో కొన్నేళ్లుగా ప్రమోషన్లు కూడా లేవు. దీంతో 30 ఏళ్లు డ్యూటీ చేసినా కండక్టర్లు కండక్టర్లుగా, డ్రైవర్లు డ్రైవర్లుగా పదవీ విరమణ పొందుతున్నారు. అయితే, ఇందుకు విరుద్ధంగ క్లాస్‌ 2 సూపర్‌వైజర్ల నుంచి క్లాస్‌ 1 అధికారుల వరకు ప్రమోషన్లు మాత్రం ఖాళీ ఏర్పడగానే వెంటనే భర్తీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత దాదాపు 120 మందికి పైగా డిపో మేనేజర్‌ ప్రమోషన్లు, 30 మందికి డివిజనల్‌ మేనేజర్‌ ప్రమోషన్లు, 20 మందికి రీజనల్‌ మేనేజర్‌ ప్రమోషన్లుతో పాటు 10 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రమోషన్లు పొందారు.

కాగా గత ఏడాది టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విసి సజ్జన్నార్‌ నియమితులయ్యారు. వీరి నియామకం తరువాత ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులు అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు పొందారు. డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, నాన్‌ ఆపరేషన్‌ యూనిట్లలో తగిన అర్హత ఉండి పై పోస్టులలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రమోషన్లు లేకుండా పని చేస్తున్న వారికి ఎడిసి, కంట్రోలర్‌, లీడిండ్‌ హెడ్‌ తదితర విభాగాలలో అన్ని క్యాటగిరీలలో ఖాళీలు ఉన్న మేరకు ప్రమోషన్లు ఇవ్వడానికి రీజనల్‌ మేనేజర్లు, వర్క్‌ మేనేజర్లకు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది.

- Advertisement -

ట్రాఫిక్‌, మెయిన్‌టెనెన్స్‌, నాన్‌ ఆపరేషనల్‌ యూనిట్లు, అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్లతో పాటు సెక్యూరిటీ, తార్నాక హాస్పిటల్‌లో పని చేస్తున్న అర్హులైన సిబ్బందికి పీఆర్‌ కోటాలో పదోన్నతులు కల్పించాలని ఉద్యోగులు సంస్థ యాజమాన్యాన్ని కోరుతున్నారు. ప్రమోషన్లలో కింది స్థాయి ఉద్యోగులు అదే స్థాయిలో రిటైర్‌ అవుతుండగా, పై స్థాయి అధికారులు అంతకంటే ఎక్కువ స్థాయికి పదోన్నతులు పొందడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

అన్ని విభాగాలలో ప్రమోషన్‌ ఖాళీలను అర్హులతో భర్తీ చేయాలి : ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సకల జనుల సమ్మెలో పాల్గొని పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ దామాషా ప్రకారం కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. వెంటనే అన్ని విభాగాలలో ప్రమోషన్‌ ఖాళీలను అర్హులైన వారికి ఇచ్చి న్యాయం చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా రాజిరెడ్డి టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌కు విజ్ఞప్తి చేశారు.

ga
Advertisement

తాజా వార్తలు

Advertisement