Monday, November 18, 2024

నష్టాలకు బ్రేక్‌.. కనిష్టాల వద్ద కొనుగోళ్లు

ముంబై : దేశీయ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల నష్టాల అనంతరం.. బుధవారం లాభాల్లోకి వచ్చాయి. గత రెండు రోజుల్లో మదుపరులు ఏకంగా రూ.8లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. బుధవారం మాత్రం మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఏ దశలోనూ నష్టపోలేదు. ఇటీవల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఆటో, ఇంధనం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు రాణించడం మార్కెట్‌కు కలిసి వచ్చాయి. ఉదయం సెన్సెక్స్‌ 56,741.43 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,216 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,521.33 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 574.35 పాయింట్ల లాభంతో.. 57,037.50 పాయింట్ల వద్ద ముగిసింది. 17,045.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 17,186 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,978.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 193.10 పాయింట్లు లాభపడి 17,151.75 పాయింట్ల వద్ద స్థిరపడింది ఎట్టకేలకు నిఫ్టీ 17వేల మార్క్‌ను మళ్లి దాటేసింది.

దేశీయంగా సానుకూలత..

దేశ వ్యాప్తంగా డిజిటల్‌ బ్యాంకుల ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాషింగ్టన్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లను ముందుకు నడిపించాయి. డాలర్‌ మారకంతో రూపాయి విలువ మార్కెట్లు ముగిసే సమయానికి 76.22 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. ఇన్వెస్టర్లు బుధవారం రూ.2.50 లక్షల కోట్ల లాభాలను పొందారు. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement