Friday, November 22, 2024

రేపటి నుంచి యాదాద్రిలో బ్రేక్‌ దర్శనాలు.. టికెట్‌ ధర రూ.300

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో ఎన్‌. గీతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి మాదిరిగా యాదాద్రిలో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో గంట చొప్పున మొత్తం రెండు గంటల పాటు బ్రేక్‌ దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో భక్తుడికి రూ.300 గా బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధరను దేవస్థానం నిర్ణయించింది.

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు. వీవీఐపీ, వీఐపీ, ప్రభుత్వ పెద్దల సిఫారస్‌ లేఖలతో వచ్చే భక్తులతో పాటు సామాన్య భక్తులు కూడా ఈ బ్రేక్‌ దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. బ్రేక్‌ దర్శనం సమయంలో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనాలను రెండు గంటల పాటు నిలుపు దల చేయ నున్నామని ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement