బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ ఒక్కరోజే మూడు వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా తొలిదశలో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్.. రెండో దశలోనూ భారీగా కొత్త కేసులు, వేలల్లో మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ మంగళవారం ఒక్కరోజే 3,251 మరణాలు సంభవించాయి. దాంతో బ్రెజిల్ ఇప్పటివరకు నమోదైన కరోనా చావుల సంఖ్య 2.99 లక్షలకు చేరువైంది.
బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోలేదని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం నాటి కరోనా మరణాల్లో ఒక్క సావోపా నగరంలోనే 1,021 మరణాలు సంభవించాయని తెలిపింది. కాగా కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో బ్రెజిల్ ఆస్పత్రుల్లో రోగులకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవడం లేదని అక్కడి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.