చేనేత మనందరి సంప్రదాయం, మన వారసత్వం అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. నైపుణ్యమున్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ అందించేందుకు శ్రీకారం చుడతామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామన్నారు. విజయవాడలోని ఆప్కో భవన్ లో 7వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో మంత్రి మేకపాటి శనివారం పాల్గొన్నారు. చేనేత రంగం మహా ప్రస్థానాన్ని..మరో ప్రస్థానంగా మలిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆయా వెబ్ పోర్టల్ ల ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు, మార్కెటింగ్ పెంచేందుకు అడుగు ముందుకు వేస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చేనేత వస్త్రాలకి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామన్నారు. యువతరానికి చేనేత వస్త్రాలను చేరువ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తామన్నారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మగ్గం వ్యవస్థకు బదులు అత్యాధునిక విధానాలైన మిషన్ లూమ్స్ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. నేత కార్మికులకు శిక్షణ లూమ్స్ కొనుగోలుకు ప్రభుత్వం సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు చేనేత వస్త్రాల రూపకల్పనలో కొత్త ఒరవడి సృష్టించిన, అద్భుత వస్త్రాలుగా తీర్చిదిద్దిన నాటి తరం 11 మంది చేనేతలకు పురస్కారాలు అందజేశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు దూరమైన 13 మంది చేనేతల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.12,500 చొప్పున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిసి ఆప్కో తరపున ఆర్థిక సాయం అందించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం మూడో విడతగా రూ.200కోట్లు అందజేయడానికి ప్రభుత్వం సన్నద్ధమయినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. మేనిఫెస్టో హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా చేనేతలకు అండగా నిలబడుతోందన్నారు. మగ్గం ఉన్న ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముడిసరుకుల కొనుగోలు సహా చేనేతల స్థితిగతులు మార్చడమే ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ అమలు ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండిః నేతన్నలకు వైసీసీ ప్రభుత్వం ద్రోహం చేసిందిః చంద్రబాబు