ఢిల్లిలో బైక్ ట్యాక్స్‌లను నడుపుకోవచ్చని ఢిల్లి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ర్యాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు అగ్రిగేటర్ లైసెన్స్ పొందకుండానే తుది పాలసీ నోటిఫై చేసే వరకు నడుపుకోవచ్చని హై కోర్టు అనుమతి ఇచ్చింది. బైక్ ట్యాక్సీలను నియంత్రించేందుకు జులై 31 లోగా లైసెన్సింగ్ విధానంతో పాటు మార్గదర్శకాలను జారీ చేస్తామని ఢిల్లి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ సంస్థలు మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను, టూ వీలర్స్‌ను ట్యాక్సీలుగా నడుపుతున్నాయని ఢిల్లి ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఢిల్లి మోటార్స్ వెహికల్ అగ్రిగేటర్ స్కీమ్-2023 కాంపిటెంట్ అథారిటీ అనుమతి పెండింగ్‌లో ఉందని ఢిల్లి ప్రభుత్వం తెలిపింది.
పోలీస్ వెరిఫికేషన్, జీపీఎస్ ఏర్పాటు, ప్యానిక్ బటన్ ఏర్పాటు వంటి నిబంధనలు పాటించకుండా బైక్ ట్యాక్సీలను నడిపించడం అనుమతించబడదని ప్రభుత్వం తన పిటీషన్‌లో పేర్కొంది. బైక్ ట్యాక్సీ నడిపించే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపింది. ఇన్సూరెన్స్ కవరేజీ లేకుంటే బైక్ ట్యాక్స్‌లు నడపడం అత్యంత ప్రమాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది.