Saturday, November 23, 2024

నేవిగేషన్‌ సాంకేతికతతో బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్లు.. క్లిష్టమైన ఆపరేషన్లు సులువుగా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌)కు అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చింది. నేవిగేషన్‌ సాంకేతితకను ఇప్పటి వరకు ప్రయాణాలు, విమానాలు, రాకేట్‌లను నడిపేందుకే వినియోగిస్తారని మనకు తెలుసు. కాని జీపీఎస్‌ ఆధారిత నేవిగేషన్‌తో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరి ని వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా అత్యాధునిక కంప్యూటరైజ్డ్‌ వ్యవస్థల అనుసంధానంతో నేవిగేషన్‌ టెక్నాలజీని శస్త్ర చికిత్స ప్రణాళిక, అమలులో వినియోగిస్తున్నారు. నేవిగేషన్‌ సాయంతో రోగి శరీరంతోపాటు తలను 3డీ విలువలైజేషన్‌ ఫోటో తీస్తున్నారు. ఈ విధానంలో ముందుగా సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ లాంటి డయాగ్నోస్టిక్‌ స్కానింగ్‌ను వినియోగించుకుని నేవిగేషన్‌ టెక్నాలజీతో వైద్యుడు రోగి మెదడు పటాన్ని రూపొందిస్తాడు. అత్యాధునిక సాఫ్ట్‌ వేర్‌తో కణితి హద్దులను, రక్తనాళాలు తదితరాలను గుర్తిస్తాడు. ఫలితంగా బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీకి చెందిన పక్కా ప్లాన్‌ను వైద్యులు తయారు చేసుకోగలుగుతున్నారు. దీంతో ఇతర అవయవాలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత మేర కణితిని తొలగించే ప్రక్రియను శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు పూర్తి చేయగలుగుతున్నారు. అదే సమయంలో రోగి మెదడుకు కనీస ప్రమాదం కూడా కలగదన్న భరోసా ఈ నేవిగేషన్‌ సాంకేతికతతో లభిస్తోంది.
రోగి మెదడులో కణితి ఎక్కడ ఉందో చూపించడంతోపాటు సర్జరీని కూడా సులువుగా , ఇతర అవయవాలకు ఇబ్బంది కలగకుండా నేవిగేషన్‌ ఆధారిత సర్జరీ పూర్తి చేస్తోంది. దీంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీకి పట్టే సమయం తగ్గడంతోపాటు శస్త్ర చికిత్స గాయం ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలను తగ్గుతున్నాయి. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం కూడా తగ్గుతోంది. నేవిగేషన్‌ సాంకేతితతో నిర్వహించే ఆపరేషన్‌తో కణితి పరిమాణం మాన్యువల్‌ సర్జరీ కంటే బాగా తగ్గుతోంది. ఫలితంగా బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులు సుదీర్ఘకాలం జీవించే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. మెదడులోని కణజాలం అసాధారణంగా పెరగడాన్ని బ్రెయిన్‌ ట్యూమర్‌ అంటారు. ప్రధానంగా మాలిగంట్‌ (క్యాన్సర్‌ సంబంధిత) కణితి మొదటిది కాగా… రెండవది బెనిగన్‌ . ఈ బ్రెయిన్‌ ట్యూమర్లు ఏ వయసువారికైనా రావొచ్చు.

బ్రెయిన్‌ ట్యూమర్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

రసాయనాలు, పురుగుమందులు పిచికారి చేసిన ఆహారపదర్థాలను తినకుండా ఉంటే మంచిది. కూరగాయలు, పండ్లతో కూడిన ఆరోగ్యవంతమైన డైట్‌తోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. స్వీయ ఔషధాలు వాడడం, అధికంగా మందులు వాడొద్దు. పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాల్సిందే. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. కారులో జీపీఎస్‌ ఏ విధంగా పనిచేస్తుందో… అదేరీతిలో న్యూరో నేవిగేషన్‌ కెమెరాల ద్వారా వైద్యుడు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు నేవిగేషన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అత్యాధునిక నేవిగేషన్‌ సాఫ్ట్‌ వేర్‌ సాయంతో వైద్యుడు కచ్చితమైన అంచనాలతో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. న్యూరో నేవిగేషన్‌ సాంకేతికతతో మెదడులోని కణితిని విచ్ఛిన్నం చేయడంతోపాటు చిన్న కోతతోనే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఈ రకమైన శస్త్ర చికిత్సలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement