Friday, November 22, 2024

బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం..

  • శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు
  • రేపు అంకురార్ప‌ణ‌
  • సెప్టెంబరు 27న ధ్వ‌జారోహ‌ణంనాడు ముఖ్య‌మంత్రి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వేంకటేశ్వరుడికి కన్యామాసం (ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలుస‌గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమాన్ని కాంక్షించ‌డంతో పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి దివ్య‌మైన ఆశీస్సుల‌ను భ‌క్తులంద‌రికీ అందించేందుకు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను టిటిడి నిర్వ‌హిస్తుంది. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించ‌నున్నందున విశేషంగా విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

రేపు అంకురార్పణం
సెప్టెంబ‌రు రేపు సోమ‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.

సెప్టెంబ‌రు 27న ధ్వజారోహణం

సెప్టెంబర్ 27వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

వాహ‌న సేవ‌ల వైశిష్ట్యం ఇలా….
పెద్దశేషవాహనం(27-09-2022)(రాత్రి 9 గంటలకు)
చిన్నశేషవాహనం(28-09-2022)(ఉదయం 8 గంటలకు)
హంస వాహనం(28-09-2022)(రాత్రి 7 గంటలకు)
సింహ వాహనం(29-09-2022)(ఉదయం 8 గంటలకు)
ముత్యపుపందిరి వాహనం(29-09-2022)(రాత్రి 7 గంటలకు)
కల్పవృక్ష వాహనం(30-09-2022)(ఉదయం 8 గంటలకు)
సర్వభూపాల వాహనం(30-09-2022)(రాత్రి 7 గంటలకు)
మోహినీ అవతారం (01-10-2022)(ఉదయం 8 గంటలకు)
గరుడ వాహనం(01-10-2022)(రాత్రి 7 గంటలకు)
హనుమంత వాహనం(02-10-2022)(ఉదయం 8 గంటలకు)
స్వర్ణరథం(02-10-2022)(సాయంత్రం 4 గంటలకు)
గజవాహనం(02-10-2022)(రాత్రి 7 గంటలకు)
సూర్యప్రభ వాహనం(03-10-2022)(ఉదయం 8 గంటలకు)
చంద్రప్రభ వాహనం(03-10-2022)(రాత్రి 7 గంటలకు)
శ్రీవారి రథోత్సవం(04-10-2022)(ఉదయం 7 గంటలకు)
అశ్వవాహనం(04-10-2022)(రాత్రి 7 గంటలకు)
చక్రస్నానం(05-10-2022)(ఉదయం 6 గంటలకు)
ధ్వజావరోహణం(05-10-2022) (రాత్రి 7 గంటలకు)

Advertisement

తాజా వార్తలు

Advertisement