Thursday, November 21, 2024

వచ్చే 3 నెలల్లో ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌ టెస్టులు : మంత్రి హరీష్‌ రావు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇండియాలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని, రానున్న మూడు నాలుగు నెలల్లో మొదటి స్థానానికి తీసుకువస్తామని, వచ్చే మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌ టెస్టులు చేయిస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డేను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా సహకారంతో గ్లోబల్‌ ఆసుపత్రి చేసిన సర్వే ఫలితాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్శంగా హరీష్‌రావు మాట్లాడుతూ సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు. నిమ్స్‌లో చేసిన సర్వే ప్రకారం ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వారిలో 60 శాతం మందికి హైపర్‌ టెన్షన్‌ ఉందని తెలిపారు. బీపీని, షుగర్‌ని ముందుగా గుర్తించకపోతే అవి ప్రాణంతకంగా మారుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 90 లక్షల మందికి స్క్రీనింగ్‌ చేస్తే, అందులో 13 లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌ టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దీనికి రూ.33 కోట్ల నిధులను సైతం కేటాయించినట్లు వెల్లడించారు. మందుల కిట్‌ ద్వారా ఉచితంగా రోగులకు మందులు సరఫరా చేస్తామన్నారు. పోస్ట్‌ కోవిడ్‌ ద్వారా హైపర్‌ టెన్షన్‌ కొంతమేర పెరిగి ఉండవచ్చు అన్నారు. పిల్లలకు వెల్త్‌ కాదు, హెల్త్‌ ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. 350 బస్తీ దవఖానాల్లో 57 రకాల టెస్టులు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి 120 రకాల టెస్టులు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. టెస్ట్‌ రిపోర్ట్స్‌ని పేషెంట్‌, డాక్టర్‌ల మొబైల్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లుదాటిన వారు బీపీ, షుగర్‌ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement