Sunday, November 24, 2024

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడమంటే దళిత, గిరిజన మహిళలను అవమానించడమే : బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీఆర్‍ఎస్ పార్టీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడమంటే దళిత, గిరిజన మహిళలను అవమానించడమేనని తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, సోయం బాపురావులతో కలిసి మంగళవారం న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్‌లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ ఆమె ప్రసంగాన్ని బహిష్కరించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే కేసీఆర్‌కు అసహ్యమని, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగం విన్న తరువాత బహిష్కరించాలని ఎవరూ అనుకోరన్నారు. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి దిశా, దశ చూపేదిగా ఉందని, గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎలా దేశాన్ని అభివృద్ధి చేసిందో, రాబోయే పాతికేళ్లలో భారత్ ప్రపంచంలో ఎంత కీలకం కాబోతోందో ప్రసంగంలో చెప్పారని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చన్నారు. బీఆర్ఎస్ పైకి చెబుతున్నది ఒకటి, లోపల ఉండేది వేరని ఆయన చెప్పారు.

కేసీఆర్ తొలి కేబినెట్‌లో ఒక్క మహిళ లేదు, మహిళా కమిషన్ లేదన్న బండి సంజయ్, మహిళా గవర్నర్‌ను కూడా సీఎం అడుగడుగునా అవమానిస్తారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే బీఆర్‌ఎస్ నేతలు రాకపోగా, కారణం కూడా చెప్పకుండా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారంటూ ఎద్దేవా చేశారు. చర్చ జరిగితే తెలంగాణలో ఇళ్ల కోసం కేటాయించిన సొమ్మంతా దారి మళ్లించారనే అంశం బయటపడుతుందని వారి భయమని విమర్శించారు. దేశమంతా ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం నిధులు మళ్లిస్తున్న సంగతి బయటకు వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉద్యోగాలివ్వడం లేదనే సంగతి బయట పడుతుందనే బీఆర్‌ఎస్ ఎంపీలు చర్చపై మొహం చాటేశారని ఆయన మండిపడ్డారు. సంచలనం కోసమే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్ నేతలు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు, బీఆర్ఎస్ నేతల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణ కోసం ఏబీవీపీ చేసిన ఉద్యమాలను గుర్తుంచుకోవాలంటూ ఆయన హెచ్చరించారు.కేసీఆర్ కుటుంబం ఎక్కడైనా పర్యటిస్తుందంటే ప్రజలు చెప్పులు నెత్తిన పెట్టుకుని పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ అరెస్టైన ఏబీవీపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, వారిపై దాడులు చేసిన నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ఎప్పుడూ మహిళలను కించపరిచే విధంగానే కేసీఆర్ వైఖరి ఉంటుందని అన్నారు. గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, మున్సిపల్ ఛైర్ పర్సన్ అయినా, ఎవరినైనా ఆయన అగౌరవపరుస్తూ ఉంటారని విమర్శించారు. గిరిజనులు, మహిళలు సహా ప్రతి ఒక్క వర్గాన్ని, కులాన్ని అవమానించేలా కేసీఆర్ వైఖరి ఉంటుందని అన్నారు. బీజేపీని బెదిరిద్దామనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని అరవింద్ భాష్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement