Friday, November 22, 2024

బాలీవుడ్‌ను భ‌య‌పెడుతున్న ‘బాయ్‌కాట్‌’..

చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైనని చాలా మంది సినీ ప్రముఖులు అభిప్రాయం. ఎప్పుడూ ఎక్కువగా అందరి దృష్టి కూడా సినీ సెలబ్రిటీలపైనే ఉంటుంది. బయట ఏం జరిగినా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు సెలబ్రిటీలు తెలివిగా స్పందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సరైన అవగాహన లేక తొందరపాటులో మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాంటివి కోకొల్లలు. కొద్ది రోజులుగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై బాయ్‌కాట్ అనే నెగిటివ్ ట్రెండింగ్‌ ట్యాగ్స్‌తో వైరల్‌ అవుతున్నాయి. చిన్న స్థాయి హీరోల నుంచి అగ్రశ్రేణి హీరోల సినిమాల వరకు ఆ ప్రభావం గట్టిగానే పడుతొంది. దీనివల్ల బాలీవుడ్‌ ఎంతగా నష్టపోయింది అనే వివరాల్లోకి వెళితే.

అమీర్‌ ఖాన్‌ నటించగా ఇటీవల వచ్చిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా, ఇంకా అక్షయ్‌ కుమార్‌ ‘రక్షాబంధన్‌’ సినిమాలపై బాయ్‌కాట్‌ సెగ ఎక్కువగా ఉంది. నెగటివ్‌ ట్యాగ్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా ‘సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి అంటూ విడుదలకు ముందు సోషల్‌ మీడియాలో రెండు మూడు వారాల పాటు నెటిజన్లు ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ”దేశం లో అసమానత్వం పెరిగిపో తుంది” అని గతంలో ఆమిర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇది. అవి ఇప్పటికీ ఆయనను వెంటాడుతున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్‌ ప్రమోట్‌ చేయడం పట్ల విజయశాంతి సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేవలం హీరోలే కాదు నిర్మాతలు దర్శకులు కూడా ఇలాంటి బాయ్‌కాట్‌ ట్యాగ్‌ నుంచి తప్పించుకోవడం లేదు. వారు గతంలో చేసిన పొరపాట్లు, అలాగే ఇతర విషయాలపై నెగిటివ్‌గా స్పందించినా కూడా బాయ్‌కట్‌ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ అయితే సినీ తారల వారసులను మాత్రమే తెరపైకి తీసుకువస్తాడు, మిగతా వారిని తొక్కేస్తాడు అనే విధంగా నెగిటివ్‌ కామెంట్‌ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న లైగర్‌ సినిమాపై పడింది. విజయ దేవరకొండ లైగర్‌ ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. బాయ్‌కాట్‌ ట్యాగ్స్‌ వల్ల ఆయన సినిమాకు ఇబ్బంది తప్పలేదు. పైగా విజయ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి. నెగిటివ్‌ బాయ్‌కాట్‌ ఎఫెక్ట్‌ దాదాపు బాలీవుడ్‌ ఇండస్ట్రీల్రో అగ్ర హీరోలు అందరూ కూడా ఎదుర్కొన్న వారే. సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ అలాగే ఇతర సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఇతర హీరోలు కూడా వీటివల్ల సతమత మవుతున్నారు. ఒకవేళ ఈ విషయంపై స్పందించిన కూడా మళ్లీ ఇంకా ఎంత రాద్ధాంతం చేస్తారో అని చాలా వరకు మౌనంగానే ఉండాల్సివస్తోంది.

యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మరణించినప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌ అగ్ర హీరోలపై నెగిటివ్‌ కామెంట్స్‌ పెరిగాయి. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ బ్రహ్మాస్త్ర సినిమాలో సుశాంత్‌ హీరో అవ్వాల్సింది.. కానీ రణ్‌బీర్‌కు అవకాశం ఇచ్చారు అని కరణ్‌ జోహార్‌పై ఒక రేంజ్‌లో ఫ్యాన్స్‌ విరుచు కుపడ్డారు. త్వరలోనే వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాను సుశాంత్‌ అభిమానులతో పాటు చాలామంది సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని అంటున్నారు. ఒక విధంగా ఈ బాయ్‌కాట్‌ నెగిటివ్‌ ట్యాగ్స్‌కు మొదట్లోనే అడ్డుకట్ట వేసి ఉంటే అయిపోయేది. దాదాపు 2019 నుంచి బాయ్‌కాట్ టాగ్స్ ఒక రేంజ్‌లో సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి అనే టాక్‌ అయితే వినిపిస్తోంది. ఏదైనా జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ఆ విషయంపై క్లారిటీ ఇస్తే అక్కడితో దానికి పులిస్టాప్‌ పడుతుంది. కానీ బాలీవుడ్‌ తారలు భయపడి దీనిపై స్పందించడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.

బాయ్‌కాట్‌ నెగిటివ్‌ ట్యాగ్స్‌ వల్ల సినిమాల ఫలితం మారుతుందా? అంటే లేదనే సినీ వ్యాపారవర్గాలు అంటున్నాయి. సినిమా బాగుంటే ఆదరణ ఉంటుంది. అయితే బాయ్‌కాట్‌ ట్యాగ్స్‌ వల్ల చర్చకు దారితీస్తుందని వారు అంటున్నారు. ఎందుకంటే దంగల్‌ కంటే ముందే ఆమిర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్‌ అయ్యాయి. ఇక ఆ తరువాత దంగల్‌ ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ తర్వాత ఆలియా భట్‌ పై కూడా మొదట్లో చాలా రకాల నెగిటివ్‌ కామెంట్స్ వ‌చ్చాయి. ఇక ఆ తర్వాత ఆమె గంగుబాయి ఖతీయవాడి సినిమాతో బాక్సాఫీస్‌ విజయం అందుకుంది. పూర్తి స్థాయిలో అయితే బాయ్‌కాట్‌ నెగటివ్‌ ట్యాగ్స్‌ సినిమా కంటెంట్‌పై ప్రభావం చూపకపోవచ్చు అని అర్థమవుతుంది. సినిమాలో కంటెంట్‌ బలంగా ఉంటే ఎవరూ ఆపలేరు అని కూడా మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement