Monday, November 18, 2024

విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కర‌ణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్‌ చట్టాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌శాఖలో ఇంజనీర్లు, సిబ్బంది విధుల బహిష్కరణకు పిలుపునివ్వడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్‌ బిల్లులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులకు మహాధర్నాకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉద్యోగులు, ఇంజనీర్లు పాల్గొంటుండడంతో విద్యుత్‌ సరఫరాకు లోపం ఏర్పడితే పరిష్కరించే వారుండరని, ప్రత్న్యామ్న్యాయ ఏర్పాట్లు చేయాలన్నా కష్టసాధ్యమని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌ కో అధికారులు అంటున్నారు. కాగా… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లను తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు, జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు రత్నాకర్‌రావు చెప్పారు. సోమవారం చేపట్టనున్న మహాధర్నా పోస్టర్‌ను ఆయన ఆదివారం విద్యుత్‌ ఐఖ్య కార్యచరణ సమితి ప్రతినిధులతో కలిసి తమ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోందని, ఇందుకు నిరసనగా విద్యుత్‌ ఉద్యోగులంతా తెలంగాణ వ్యాప్తంగా విధులను బహిష్కరిస్తున్నారని చెప్పారు. విద్యుత్‌ వినియోగదారులందరూ తమకు సహకరించాలని అభ్యర్థించారు. విద్యుత్‌ సవరణ చట్టంతో వినియోగదారులకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునుద్దరణ పనులు చేయకుండా నిరసన చెబుతామని, అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని రత్నాకర్‌రావు హెచ్చరించారు. విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించేందుకే కేంద్రం బిల్లును తీసుకొస్తోందని, ప్రయివేటు సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా అదే విద్యుత్‌ లైన్‌ నుంచి సరఫరా చేసేలా ఈ నూతన బిల్లు ఉపకరిస్తుందని చెప్పారు. దీనివల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని, డిస్కంలు పూర్తిస్థాయిలో నిర్వీర్యమై పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా పారిశ్రామిక వేత్తలకు విద్యుత్‌ సంస్థలను ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 12 రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మాణం చేస్తూ కేంద్రానికి పంపాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కూడా ఇదివరకే ఈ చట్టాన్ని నిరసిస్తూ తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసిన రత్నాకర్‌ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెడితే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని, భాజపా నాయకులను, ఎంపీలను, కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకుంటామని, ఆ పార్టీ నేతలకు, కేంద్ర మంత్రులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. భాజపా ఎంపీలు ఆలోచించి ప్రజలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement