Friday, November 22, 2024

National : బోరుబావిలో ప‌డ్డ బాలుడు…ర‌క్షించిన‌ అధికారులు

బోర్‌వెల్‌లోపడిన రెండేళ్ల బాలుడిని రక్షించిన అధికారులు పొలంలోని బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడిని అధికారులు రక్షించారు.సుమారు 18 గంటల పాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని బోరుబావినుంచి బయటకు తీసుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

లచయానా గ్రామానికి చెందిన సతీశ్‌ ముజగొండ తన ఇంటి వద్ద ఉన్న నాలుగు ఎకరాల పొలంలో బోరుబావి తవ్వించాడు. బుధవారం సాయంత్రం సమయంలో సతీశ్‌ రెండేళ్ల కుమారుడు సాత్విక్‌ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు . చిన్నారి ఏడుపు విన్న కొందరు స్థానికులు వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులకు, అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడి కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి తీవ్రంగా శ్రమించారు. ఎక్స్‌కవేటర్‌తో బోర్‌వెల్‌కు సమాంతరంగా 21 అడుగుల లోతులో గొయ్యి తవ్వారు. 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి ఎట్టకేలకు బాలుడిని బయటకు తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై స్పష్టత లేదు. అంబులెన్స్‌తో అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య బృందం బాలుడికి అత్యవసర ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement