Friday, November 15, 2024

Kashmir | అందాల కాశ్మీర్​కు పర్యాటకుల శోభ.. పెద్ద ఎత్తున తరలివస్తున్న టూరిస్టులు

పర్యాటకుల రాకతో కాశ్మీర్ మరింత కళ సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివచ్చారు. 2019లో ఆర్టికల్​ 370ని రద్దు చేయడం.. ఆ తర్వాత కొవిడ్​ మహమ్మారి వంటి కారణాలతో రెండేండ్లపాటు టూరిస్టుల రాకకు ఆంక్షలున్నాయి. ఆ తర్వాత జమ్ము కశ్మీర్​లో  టూరిజంపై ఫోకస్​ పెంచారు అధికారులు. దీంతో ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక పెరుగుతోందని చెబుతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టూరిస్టుల రాకతో కాశ్మీర్​ సందడిగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ టూరిస్టుల రాక కొనసాగుతోంది. దీంతో రికార్డులు బద్దలు కొట్టేలా ఒక్క ఫిబ్రవరిలోనే1.2 లక్షల మంది సందర్శకులు వచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో టూరిజంపై ఆధారపడ్డ చాలామందికి కాస్త ఉపశమనం లభించింది. ఇక.. 2022 ఒక్క ఏడాదిలో కాశ్మీర్‌ను సందర్శించిన సందర్శకుల సంఖ్య 25 లక్షలకు చేరుకుంది. ఇది గత 40 ఏళ్ల సగటు కంటే గణనీయంగా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో 1.2 లక్షల మందికి పైగా ప్రజలు కాశ్మీర్‌కు వెళ్లారని, వారిలో 90 శాతం మంది కాశ్మీర్‌లోని ప్రసిద్ధ గుల్‌మార్గ్ స్కీ రిసార్ట్ ను సందర్శించారని కాశ్మీర్ టూరిజం డైరెక్టర్ ఫజల్-ఉల్-హసీబ్ చెప్పారు.

శ్రీనగర్ తులిప్ గార్డెన్..

గత సంవత్సరం నుండి పర్యాటకుల రాక పెరిగింది. రాబోయే నెలల్లో ఈ ధోరణి కొనసాగుతుందని ఆశాభావంతో ఉన్నామని టూరిజం డైరెక్టర్​ అన్నారు. ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్‌ శ్రీనగర్‌లో ఉంది. ఇక్కడ నిర్వహించే తులిప్ ఫెస్టివల్‌తో సహా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో మార్చి, ఏప్రిల్‌లలో పలు కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.  సందర్శకుల సంఖ్యను పెంచేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నామని చెప్పారు. టూరిస్ట్ సీజన్ కోసం అన్ని విధాల సమాయత్వం అవుతున్నామని హసీబ్ తెలిపారు. అలాగే, శ్రీనగర్ తులిప్ గార్డెన్‌లో మరికొన్ని రకాల తులిప్స్, ఇతర పూల మొక్కల రకాలను పెంచుతున్నట్టు తెలిపారు. ఇది పర్యాటకులకు ప్రముఖ ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

- Advertisement -

కాగా, గుల్మరాగ్ ఇప్పటికీ మంచుతో నిండిపోయి ఉంది.. దీంతో పర్యాటకుల సందడి నెలకొంది. ప్రముఖ సింగర్​ శంకర్ మహదేవ్ తన కుటుంబంతో కలిసి ఆదివారం గుల్మరాగ్‌ని సందర్శించారు. ” భూతల స్వర్గం కశ్మీర్.. అది నాకు భిన్నమైన అనుభవం” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

టూరిజం పరంగా కాశ్మీర్‌కు 2022 ఉత్తమ సంవత్సరం అని పర్యాటక శాఖకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు. “ఈ ఏడాది కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది. శీతాకాలపు రిజర్వేషన్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ట్రావెల్ సీజన్ బిజీగా ఉంటుందని భావిస్తున్నాం” అని చెప్పుకొచ్చారాయన. ఇక.. 2017లో మొత్తం 11 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించగా.. 2018లో కేవలం 8.5 లక్షల మంది మాత్రమే సందర్శించారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement