Tuesday, November 26, 2024

ఇంకా బడులకు చేరని బుక్స్​.. మరో 20 రోజుల్లో స్కూల్స్​ పున:ప్రారంభం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాఠశాలలు పున:ప్రారంభమయ్యే రోజే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసేలా విద్యాశాఖ అధికారులు లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడడంలేదు. మరో 20 రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఇప్పటి వరకూ జిల్లాలకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇంకా చేరనేలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 62 శాతం పాఠ్యపుస్తకాలు మాత్రమే జిల్లాలకు చేరాయి. మిగితావి ఈ 20 రోజుల్లో చేరవేయాల్సి ఉంటుంది. అవి జిల్లాలకు చేరాలి.. అక్కడి నుంచి మండలాలకు… పాఠశాలలకు చేరాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే ఎక్కువ సమయమే పట్టనుంది. ఒకవేళ పాఠశాలలు పున:ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు చేరకుంటే పాత పుస్తకాలతోనే విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే పాఠశాలలకు పుస్తకాలు చేరడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్ని జిల్లాలకు పుస్తకాల రవాణా కోసం ఇచ్చే బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పుస్తకాల రవాణాలో జాప్యం జరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని జిల్లాలకు రెండు మూడు సంవత్సరాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరో 20 రోజుల్లో పాఠశాలల తలుపులు తెరుచుకోనుండగా ఇంకా 38 శాతం పుస్తకాలు జిల్లాలకు చేరనేలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్‌ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని 28,77,675 మంది విద్యార్థులకు 1,63,78,607 పుస్తకాలను ఉచితంగా అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,10,888 పుస్తకాలు అంటే 62 శాతం మాత్రమే జిల్లాలకు చేర్చారు. మరోవైపు మే నెలాఖరు వరకు 100 శాతం పుస్తకాలు జిల్లాలకు చేర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

గతంలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం నేపథ్యంలో పేపర్‌ ముడిసరుకు లభించక పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. కానీ ఈసారి ముందస్తుగానే ముద్రణ చేపట్టినా ఇంత వరకు 62 శాతం మాత్రమే పుస్తకాలు జిల్లాలకు చేరవేశారు. పుస్తకాలు ముద్రణ సంస్థ నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుతాయి. అక్కడి నుంచి మండల పాయింట్లకు పంపుతారు. మండల పాయింట్ల నుంచి స్కూళ్లకు చేరిన తర్వాత వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఇదంతా జరగాలంటే కనీసం 20 రోజులపైనే సమయం పడుతోంది.

కొన్ని జిల్లాలకు అన్ని పుస్తకాలు చేరవు. ఒకట్రెండు పుస్తకాలు ఇంకా బడులు తెరుచుకున్న నాటికి కూడా అందవు. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పటి దాకా విద్యార్థులు బడులకు వెళ్లి ఏమి చదువుకుంటారో, ఉపాధ్యాయులు వారికి ఎలా పాఠాలు చెబుతారో అధికారులకే తెలియాల్సి ఉంది. మరోవైపు తొమ్మిదో తరగతికి ద్విభాషా పుస్తకాలు ఇవ్వనున్నారు. ఒకే పుస్తకంలో ఇంగ్లీష్‌, తెలుగు రెండు భాషల్లో ముద్రించి పార్ట్‌-1, పార్ట్‌-2 పుస్తకాలను వేర్వేరుగా ఇస్తారు. ఈసారి పుస్తకం పేపర్‌ మందం కూడా పెంచారు. గతంలో 70జీఎస్‌ఎం ఉండగా, దాన్ని 90 జీఎస్‌ఎంకు పెంచిన విషయ తెలిసిందే.

పుస్తకాల లెక్కలు…

విద్యార్థులు-28,77,675
అవసరమయ్యే పుస్తకాలు-1,63,78,607
ముద్రించాల్సినవి-1,57,48,270
గతేడాది మిగిలిన పుస్తకాలు-6,30,337
జిల్లాలకు చేర్చినవి-97,10,888 (62శాతం)
ఇంకా చేర్చాల్సినవి-60,37,382

Advertisement

తాజా వార్తలు

Advertisement