Saturday, November 23, 2024

డిసెంబర్‌ 22 నుంచి పుస్తక ప్రదర్శన .. క‌ళాభార‌తి స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణాకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖా మంత్రి వీ.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జులూరు గౌరీశంకర్‌ మంత్రిని కలిసి ఈ నెల 22నుంచి జనవరి 1 వరకు జరిగే పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌) స్టేడియంలో పుస్తక ప్రదర్శన కు అనుమతి ఇవ్వవలసినదిగా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా ఇందిరాపార్క్‌ దగ్గర ఉన్న తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో అతి పెద్ద బుక్‌ఫెయిర్‌ నిర్వహించడం అభినందించదగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ లక్షలాది మంది పుస్తక ప్రియులను కదిలించే శక్తిగా పుస్తక ప్రదర్శన మారడం, అన్ని భాషల పుస్తకాలతో పాటు- తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా విచ్చేయనున్న దాదాపు మూడు వందలకు పైగా పబ్లిషర్స్‌ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిత్య చదువరి కావడం వల్ల ఈ పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని తెలిపారు.

ఈ బుక్‌ ఫెయిర్‌ కు తమ సాంస్కృతిక శాఖ తరపున ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బుక్‌ ఫెయిర్‌ ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బుక్‌ ఫెయిర్‌ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement