Monday, November 25, 2024

TG | బోనస్ కూడా బోగస్సే.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ !

సింగ‌రేణి కార్మికుల‌కు తీపి కబురు అంటూ చేదు కబురు చెప్పరంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమ‌ర్శించారు.

దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని.. సంస్థ గడించిన లాభాల ఆధారంగా కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్ చేశార‌ని మండిప‌డ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో కోత విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 4701 కోట్లలో 33% కార్మికులకు బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లాభాల వాటాలో 50% కోత విధించి కార్మికులకు చేస్తున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఎంతో శ్రమించి సంస్థకు డబుల్ ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు.

గత ఆర్థిక సంవత్సరం 2022-23లో వ‌చ్చిన‌ లాభాలు రూ.2222 కోట్లు, అయితే ఇందులో 32 శాతం, అంటే దాదాపు రూ.710 కోట్లు కార్మికులకు అందించామ‌ని తెలిపారు. అయతే, ఈ ఏడాది 2023-24కి వచ్చిన లాభాలు రూ.4701 రూ.కోట్లు కాగా ప్రభుత్వం చెప్పిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మొత్తంగా దాదాపు రూ.1550 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉందని.. కానీ కార్మికులకు ప్రకటించింది కేవలం రూ.796 కోట్లే అని… అంటే ఇది కేవ‌లం 16.9 శాతం అని.. కార్మికులకు హక్కుగా రావాల్సిన మిగతా వాటా 754 కోట్లు ఏమైనట్టు? అని ప్ర‌శ్నించారు.

రూ.4,701 కోట్ల లాభాన్ని చూపి కేవలం రూ.2,412 కోట్లపై 33 శాతం బోనస్ ప్రకటించడం ఏంటి? అని…. మిగిలిన రూ.2,289 కోట్లకు బోనస్ ఎగ్గొట్టడం ఏమిటి? అని నిల‌దీశారు. ఆల్‌టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? కార్మికులు చేస్తున్న కష్టానికి ఫలితం దక్కకపోవడం దారుణమన్నారు.

- Advertisement -

కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోయిందని తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బటాలో పట్టించారని… కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు అని అన్నారు.

సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమేన‌ని… స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారని అన్నారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుందని మ‌డ్డిప‌డ్డారు. ఘ‌నంగా చెప్పుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాటా విషయంలోనూ ఇదే పరిస్థితి నెల‌కొంద‌ని తెలిపారు. ఉద్యోగుల సంఖ్యను కుదించి 5వేల బోనస్ కొందరికే పరిమితం చేయడం మరో మోసం అని అన్నారు.

కాగా, బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే…. లాభాల్లో వాటా చెల్లించాలని, మొత్తం 4701 కోట్లలో 33% బోనస్ గా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని. కార్మికుల పక్షాన పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement