Saturday, November 16, 2024

బొందలు వరి రకానికి మళ్లి గిరాకీ ! ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : గత ఏడేళ్లుగా కొనుగోళ్లు నిలచిపోయిన బొందలు రకం (ఎంటీయూ-3626) వరి పంటను తిరిగి కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ రకం వరి సాగును గత ప్రభుత్వం నిరుత్సాహపరిచిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ సీజన్‌లో రైతుల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈరకం ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి బొందలు రకాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే రైతులకు తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో బోందలు రకాన్ని రైతులు సాగు చేశారు. ఎకరాకు దాదాపు 55 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రకం పంట కొనుగోలుకు అడ్డంకులు తొలిగిపోయాయని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ రకం వరి రెండవ పంటగా పెద్ద ఎత్తున సాగుచేస్తారు. ఇది బాయిల్డ్‌ (ఉడకబెట్టిన) రకానికి చెందిన వరి వంగడం.

గతంలో ఈ వెరైటీని రైస్‌ మిల్లర్లు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువ చెల్లించి అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. దీనికి కేరళలో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అయితే కేరళలతోపాటు తమిళనాడులో కూడా రైతులు ఇదే రకాన్ని పండిస్తున్నారు. ఏపీలో వరి పంటకు మద్దతు ధరలు బాగనే ఉన్నాయి. దీంతో తమిళనాడు రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు ఏపీ నుండి కొనుగోళ్ల పరిమాణాన్ని తగ్గించుకున్నారు. ఎఫ్‌సిఐ బాయిల్డ్‌ బియ్యాన్ని కూడా కొనుగోలు చేసేది. ఈనేపథ్యంలోనే వరి పంట అమ్మకాలు, కొనుగోళ్లకు సబంధించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నుండి ఆరు సంవత్సరాలలో వరి సాగును నియంత్రిస్తూ వస్తోంది. మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వంతో ఇందుకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఇది ఆశించిన రీతిలో ముందుకు సాగలేదు.

5 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతి..

రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఇటీవల ఢిల్లిd పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర బొందలు రకం వరి పంటను కొనుగోలుచేసేలా కేంద్ర పెద్దలను ఒప్పించడం జరిగింది. ఈ బియ్యాన్ని ఎఫ్‌సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది. కనీస మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ. 1530 లభించాల్సి ఉంది. రైస్‌ మిల్లర్లు మాత్రం 75 కిలోల బస్తాకు రూ. 1200 వంతున మాత్రమే చెల్లిస్తున్నారు. ఈక్రమంలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో నిషేధం..

తెలుగుదేశం హయాంలో బొందలు రకం వరి సాగును నిషేధించారు. సీఎం జగన్‌ నేతృత్వంలోని వైయస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో బోందలు రకానికి సంబంధించి ఉత్పత్తి తక్కువగా ఉండేదని, దీంతో రైస్‌మిల్లర్లు ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసేవారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు లక్షల ఎకరాల్లో ఈరకాన్ని పండించారని, అందుకే సరఫరా ఎక్కువగా ఉందని ఫలితంగా కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎంఎస్‌పీ దక్కని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈనేపథ్యంలో దాదాపు ఆరేడేళ్ల తరువాత ఈ రకం వరి పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్రం కొనుగోలుకు ముందుకొచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర కొనుగోలు లక్ష్యం 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకోవడానికి రైతుల వద్ద ప్రస్తుతం ఉన్న పరిమాణం సరిపోదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, గోదావరి జిల్లాల్లోని చాలా మంది రైతులు తమ పంటను రైస్‌మిల్లర్లు ఎంఎస్‌పి కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement