హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే నెల 7 నుంచి బోనాలు వేడుకలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడి నుంచి మొదలు కానున్నది. ప్రతి ఏటా ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి నైవేద్యం పెడతారు. పోతరాజుల నృత్యాలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాలు మూడు దశలలో జరుగుతుంది.
వాటిని గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి బోనాలు అని జరుపుకుంటారు. 150 ఏళ్ల క్రితం కలరా మహమ్మారి రావడంతో తొలిసారి ఈ బోనాలు పండుగ వేడుకలు జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది. మహంకాళి అమ్మవారి ఆగ్రహం కారణంగానే నాడు కలరా వ్యాపించిందని ఓ నమ్మకం.. అప్పటి నుంచి అమ్మవారికి బోనాల వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.