చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా.. సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు.